Guntur: స్నేహితుడి పుట్టిన రోజు… ఆశ్చర్యపరుస్తానంటూ అనంత లోకాలకు చేరుకున్న మిత్రుడు…
మిత్రుడికి ఎవరూ ఊహించని విధంగా జన్మదిన సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్న హిమేష్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయం… చివరకు విషాదంగా మారింది. అర్ధరాత్రి సమయంలో బ్యానర్‌తో లోకేష్ హాస్టల్ వద్దకు వెళ్లిన హిమేష్, దాన్ని కట్టే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

మిత్రుడికి ఎవరూ చెప్పని విధంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని భావించాడు. అందుకు తగిన విధంగా ప్లాన్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో ప్లెక్స్ తీసుకొని స్నేహితుడి ఉండే హాస్టల్ వద్దకు వెళ్లాడు. ప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు వారించారు. మరో స్నేహితుడితో కలిసి దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలిసిన స్నేహితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు.
తణుకుకు చెందిన లోకేష్ నంబూరులోని వివిఐటియూలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వల్లభాపురానికి చెందిన హిమేష్ రెడ్డి కేఎల్ యూనివర్శిటిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చెర్రీ అనే కామన్ ఫ్రెండ్ ద్వారా లోకేష్, హిమేష్ రెడ్డి స్నేహితులయ్యారు. హాస్టల్‌లో ఉండే లోకేష్ బర్త్ డే ఉందని తెలుసుకున్న హిమేష్ రెడ్డి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. వివిఐటియూకు వెళ్లే రోడ్డులో లోకేష్ ఉంటున్నాడు. దీంతో చెర్రి సాయంతో హిమేష్ రెడ్డి ఒక బ్యానర్ వేయించి దాన్ని లోకేష్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని రాత్రి సమయంలో దాన్ని కట్టేందుకు హాస్టల్ వద్దకు వెళ్లారు. హాస్టల్ ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంభానికి బ్యానర్ కట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ ఇంటి యజమాని వారించాడు. అక్కడ నుంచి తీసి.. హాస్టల్ రూం వద్దే ఫ్లెక్సీ పెట్టారు. అయితే కాలేజ్‌కు చెందిన ఇద్దరు గార్డులు వచ్చి ప్లెక్స్ తీసేమని చెప్పారు. దీంతో చేసేదేమి లేక హిమేష్ రెడ్డి మరో స్నేహితుడు రామకృష్ణతో కలిసి ఫ్లెక్సీ తొలగిస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలింది. ఇద్దరూ విద్యుత్ షాక్ గురయ్యారు. స్థానికులు స్పందించి వెంటనే ఇద్దరిని గుంటూరు తరలించారు. అయితే అప్పటికే హిమేష్ రెడ్డి మరణించినట్లు వైద్యులు చెప్పారు. రామకృష్ణ గాయాలతో కోలుకుంటున్నారు.
ఈ విషయం లోకేష్‌కు తెలియడంతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. తన పుట్టిన రోజు నాడు ఇద్దరికి విద్యుత్ షాక్ కొట్టడం ఒక స్నేహితుడు చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఇంపార్టెంట్ పరీక్ష రాయాల్సి రావడం లోకేష్‌ను మరింత తీవ్ర స్థితిలోకి నెట్టింది. అయితే పరీక్షకు హాజరై వచ్చిన తర్వాత స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న రెండు యూనివర్సిటీల్లోని స్నేహితులు విలపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
