Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పొలంలో పని చేస్తుండగా భీకర అరుపులు.. సెకన్లలోనే భయానకంగా మారిన వాతావరణం..

సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు.. అది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి కొండ ప్రాంతం. పొలాల్లో రైతులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అలా పొలం పనుల్లో ఉన్న రైతులకు పెద్ద పెద్దగా అరుస్తున్న ఓ జంతువు గొంతు వినిపించింది . కొండ సమీపం కావడంతో ఏదో ప్రమాదకర జంతువు తన వైపు వస్తుందని గ్రహించి రైతులు తమ పొలం పనులు పక్కనబెట్టి పరుగులు తీశారు. అలాంటి అరుపులు గతంలో ఎప్పుడూ వినకపోవడంతో ఏదో ప్రమాదకరమైన జంతువు సంచరిస్తుందని వారంతా అనుకున్నారు.

Andhra Pradesh: పొలంలో పని చేస్తుండగా భీకర అరుపులు.. సెకన్లలోనే భయానకంగా మారిన వాతావరణం..
Vizianagaram
Follow us
G Koteswara Rao

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 13, 2023 | 10:00 PM

సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు.. అది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి కొండ ప్రాంతం. పొలాల్లో రైతులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అలా పొలం పనుల్లో ఉన్న రైతులకు పెద్ద పెద్దగా అరుస్తున్న ఓ జంతువు గొంతు వినిపించింది . కొండ సమీపం కావడంతో ఏదో ప్రమాదకర జంతువు తన వైపు వస్తుందని గ్రహించి రైతులు తమ పొలం పనులు పక్కనబెట్టి పరుగులు తీశారు. అలాంటి అరుపులు గతంలో ఎప్పుడూ వినకపోవడంతో ఏదో ప్రమాదకరమైన జంతువు సంచరిస్తుందని వారంతా అనుకున్నారు. అక్కడ నుండి కొంత దూరంగా వచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. అంతటితో ఆగకుండా కొందరు యువకులు అంతా కలిసి ఒక గుంపుగా ఏర్పడి జంతువు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వినిపిస్తున్న అరుపులను గమనిస్తూ జంతువు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వలలో చిక్కుకున్న జంతువు మాత్రం కదల్లేని పరిస్థితిలో ఉంది. కానీ యువకులను చూసిన ఆ జంతువు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. వలలో చిక్కుకుని ఉండటంతో కేవలం ఒక అడుగు లేదా రెండు అడుగుల మించి ముందుకు కదల్లేక పోతుంది. ఇంతలో సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వలలో చిక్కుకున్న జంతువును నిశితంగా పరిశీలించి అది ఎలుగుబంటిగా తేల్చారు.

అయితే ఎలుగుబంటి అప్పటికే కొన్ని గంటలుగా వలలో చిక్కుకొని వల నుండి బయట పడేందుకు తీవ్రంగా శ్రమించింది. ఆ క్రమంలోనే గాయాలపాలై ఆందోళనలో రెచ్చిపోయి భయంకరంగా అరుస్తుంది. ఎలుగుబంటి అరుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఆ పరిస్థితుల్లో అటవీశాఖ సిబ్బంది కూడా ఎలుగు బంటిని రెస్క్యూ చేయలేక వెంటనే విశాఖ జూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న జూ అధికారులు డాక్టర్ ఫణీంద్ర తో పాటు మరికొంత మంది సిబ్బంది ఎలుగుబంటి బందీగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం మూడు అయ్యింది. ఎలుగుబంటి తీవ్ర అలసటతో, గాయాల పాలై ఉంది. వల మెడకు ఉచ్చుగా ఉండటంతో మెడ ప్రాంతం, అలాగే ఎడమ కాలికి కూడా గాయాలయ్యాయి. పరిస్థితి గమనించిన జూ సిబ్బంది ఎలుగుబంటి సమీపంలోకి వెళ్లి రెస్క్యూ ప్రారంభించారు. తమ వద్ద ఉన్న గన్ ఇంజక్షన్ సహాయంతో ఎలుగుబంటికి తగ్గ మోతాదులో మత్తు ఇచ్చారు. దీంతో కొద్ది సేపటికి ఎలుగుబంటి మత్తులోకి జారింది. తరువాత ఎలుగుబంటి స్పృహ కోల్పోయిందని నిర్ధారించుకొని ఎలుగుబంటిని తీసుకొచ్చి బోనులో బంధించారు అటవీశాఖ అధికారులు.

దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జరిగిన ఘటన పై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అసలు కొండ ప్రాంతంలో వలను ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? అని దర్యాప్తు చేయగా అడవి జంతువుల వేట కోసం వేటగాళ్ల పనిగా ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. మరుపల్లి కొండ ప్రాంతంలో అడవి పందులు ఎక్కువగా సంచరిస్తుండటంతో అడవి పందులను బంధించేందుకు వేటగాళ్లు వలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో నిషేధిత జంతువుల వేట కోసం వలను ఏర్పాటు చేసిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు. వేటగాళ్లు వలను ఇదే మొదటి సారిగా ఏర్పాటు చేశారా? లేక తరుచూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి జంతువులను వేటాడుతున్నారా? అలా వేటాడితే ఎన్ని జంతువులు వేటగాళ్ల వలకు చిక్కాయి? ఎలాంటి జంతువులను వారు బంధించారు? ఇలా అనేక కోణాల్లో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..