Bear Search Operation Success: ఆపరేషన్ భల్లూక్ సక్సెస్.. ఎట్టకేలకు ఎలుగు బంటి దొరికిందోచ్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
Bear Search Operation Success: శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ బంటి సక్సెస్ అయింది. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగు మత్తులోకి పోయిన తర్వాత మూతికి గుడ్డకట్టి..
Bear Search Operation Success: శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ బంటి సక్సెస్ అయింది. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగు మత్తులోకి పోయిన తర్వాత మూతికి గుడ్డకట్టి.. తాళ్లతో బంధించారు. ఆ తర్వాత బోనులోకి తరలించారు. కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎలుగు బంటి ఎట్టకేలకు దొరకడంతో.. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమించి.. ఎలుగును అదుపులోకి తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు చెప్తున్నారు. అంతకు ముందు ఎలుగును గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామ పరిసరాలను ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు జల్లెడ పట్టారు. వేర్వేరు బృందాలుగా విడిపోయి బంటి జాడ కోసం శ్రమించారు. డ్రోన్లతోనూ సెర్చ్ చేశారు.
చివరకు ఓ ఇంట్లో ఎలుగుబంటి దూరినట్టు గుర్తించి.. ఆపరేషన్ భల్లూక్ మొదలు పెట్టారు. కిడిసింగిలో ఎలుగు బంటి ఉన్న షెడ్డు చుట్టూ వలలు కట్టారు. ప్రస్తుతం ఎలుగుబంటి దూరిన ఇంటిని అధికారులు రౌండప్ చేశారు. అక్కడికి 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించలేదు. ఎలుగుబంటి వనాన్ని వీడి జనంలోకి రావడం.. సిక్కోలు జనం ఒంట్లో వణుకు పుట్టించింది. హాహాకారాలు చేస్తూ.. ఆగ్రహంతో రగిలిపోతూ.. పగబట్టినట్టు దాడులు చేస్తున్న తీరు దడ పుట్టించింది.
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి వెళ్లిన టీవీ9 టీమ్ వాహనంపై ఒక్కసారిగా ఎలుగు బంటి దండయాత్ర చేసింది. వెంటపడి వేటాడినంత పని చేసింది. ఆగ్రహంతో రగిలిపోతూ మీదపడే ప్రయత్నం చేసింది. టీవీ9 వాహనం వెంట ఎలుగుబంటి వెంబడించిన క్రమంలో ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది భయంతో వణికిపోయారు. అయితే వాళ్లందరికి టీవీ9 వాహనం షెల్టర్‌గా మారిపోయింది. గంటల పాటు టీవీ9 ప్రతినిధులతో పాటు సిబ్బంది కూడా వాహనంలోనే ఉండిపోయారు.
అప్పటివరకు శబ్దాలు విన్న అటవీ శాఖ అధికారులు.. టీవీ9 వాహనాన్ని వెంబడించిన తీరును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రక్తం రుచి మరిగిన ఎలుగు ఇదేనని గుర్తించి.. ఆపరేషన్ భల్లూక్ చేపట్టారు.కిడిసింగి పరిసరాల్లో గతంలోనూ ఎలుగు కనిపించింది. కానీ వాటి దారిన అవి వెళ్లిపోయేవి. కానీ ఈ సారి మాత్రం స్వైర విహారం చేసింది. ఒకరిని హతమార్చిన ఎలుగుబంటి.. 24 గంటలు గడవకముందే మరో ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి