Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC Cargo Services: మీ ఇంటికే ఆర్టీసీ కొరియర్ సేవలు.. బుధవారం నుంచి ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్ర ప్రగతి రథ చక్రం APSRTC కొత్త హంగులతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాప్తి సమయంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న APSRTC  ఆదాయాన్ని పెంచుకునే..

APSRTC Cargo Services: మీ ఇంటికే ఆర్టీసీ కొరియర్ సేవలు.. బుధవారం నుంచి ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
Apsrtc Cargo Services
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 31, 2021 | 8:17 PM

ఆంధ్ర ప్రగతి రథ చక్రం APSRTC కొత్త హంగులతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. కరోనా వ్యాప్తి సమయంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న APSRTC  ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఫోకస్ పెట్టింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్‌ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది. మొదటి సారి ఇలాంటి సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. ఇదే మార్గాంలో APSRTC ప్రయాణిస్తోంది.

రాబోయే రోజుల్లో మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేట్ కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలను రెడీ చేసింది. గుంటూరు జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం టార్గెట్‌గా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

APSRTC కొరియర్‌ సేవలను ఇళ్లకే అందించాలని AP రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్‌ డెలివరీ సేవలు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా, వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సేవలు అందించనున్నారు.

అయితే.. ప్రస్తుతానికి APSRTC తీసుకొచ్చిన డోర్‌ డెలివరీని బుకింగ్‌ ఏజెంట్‌ కాంట్రాక్టర్ల ద్వారా కొద్ది రోజుల పాటు చేయనున్నారు. APSRTC బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరుగనుందని APSRTC భావిస్తోంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దీంతో బుక్‌ చేసిన పార్శిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్‌ కనిపించకుండా పోతే ఖాతాదారులకు పరిహారం లభిస్తుంది.

బుధవారం నుంచి ఇంటికే APSRTC కొరియర్ సేవలు..

☛ కేజీ బరువుకు – 15 రూపాయలు ☛ 1 – 6 కేజీలకు – 25 రూపాయలు ☛ 6 – 10 కేజిలకు – 30 రూపాయలు + GST చెల్లించాల్సి ఉంటుంది

తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ చేయనుంది. గుంటూరు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్‌ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..