AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం.. అయోమయంలో జనం

ఏపీలో వాతావరణం ఊహించని మలుపు తిరిగింది. చలికాలం పూర్తిగా వీడకముందే పగటి వేళ ఎండలు మండిపోతుండగా… రాత్రివేళ చలి గాలులు వణికిస్తున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తీవ్ర వ్యత్యాసం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ...

Andhra Pradesh: ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం.. అయోమయంలో జనం
Andhra Weather
M Sivakumar
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 11:10 AM

Share

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. చలికాలం పూర్తిగా ముగియకముందే. ఎండ తీవ్రత మొదలవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో మధ్యాహ్నం వేళ భానుడు భగభగా మండిపోతున్నాడు.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఎండకు తోడు వాహనాల పొగ , పొల్యూషన్ కలిసి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..

పగలు మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు రాత్రివేళ కూడా ఉపశమనం లభించడం లేదు. చలిగాలులు వీయడంతో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతోంది. ఈ మార్పు పిల్లలు , వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో 33.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది. అదే సమయంలో రాబోయే మూడు రోజులపాటు రాయలసీమ ప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అయితే ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రం చలి ఇంకా పూర్తిగా తగ్గలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎత్తైన కొండప్రాంతాల్లో ఉదయం వేళ మంచు చలి, పొగ మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.. మరోవైపు వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా దక్షిణాంధ్ర ప్రాంతాల్లో తేలికిపాటి వర్షాలు కురిసాయి. చిత్తూరు , అన్నమయ్య , శ్రీ సత్యసాయి జిల్లాలో చినుకులతో కూడిన వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పంటలపై స్వల్ప ప్రభావం కనిపించగా రైతులు వాతావరణం మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య బయటకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. తాగునీరు , తేలికపాటి ఆహారం తీసుకోవడం, చిన్నారులు, వృద్ధులను నేరుగా ఎండలోకి పంపించకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతున్న ఒకవైపు మండుతున్న ఎండ , మరోవైపు చలి గాలులు వీస్తున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.