AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయ నాయకులను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు.. బల్వంతరాయ్ నుంచి అజిత్ పవార్ దాకా..!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. గత ఏడు నెలల్లో ప్రముఖ నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడం ఇది రెండోసారి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జూన్ 2025లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భారతదేశ చరిత్రలో, ఏడుగురు ప్రముఖ నాయకులు విమానం ,హెలికాప్టర్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు.

రాజకీయ నాయకులను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు.. బల్వంతరాయ్ నుంచి అజిత్ పవార్ దాకా..!
Sanjay Gandhi, Ajit Pawar, Vijay Rupani
Balaraju Goud
|

Updated on: Jan 28, 2026 | 11:20 AM

Share

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. గత ఏడు నెలల్లో ప్రముఖ నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడం ఇది రెండోసారి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జూన్ 2025లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భారతదేశ చరిత్రలో, ఏడుగురు ప్రముఖ నాయకులు విమానం , హెలికాప్టర్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బల్వంత్రాయ్ మెహతా, దోర్జీ ఖండు, వై. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అసువులు బాసారు.

ఏయే నాయకులు చనిపోయారు?

బల్వంతరాయ్ మెహతాః

1963 నుండి 1965 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1965 యుద్ధ సమయంలో, మెహతా రాన్ ఆఫ్ కచ్ మీదుగా తనిఖీ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన విమానాన్ని పాకిస్తాన్ కూల్చి వేసింది. మెహతా, ఆయన భార్య, ఆయన ముగ్గురు ఉద్యోగులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు. విమాన ప్రమాదంలో మరణించిన మొదటి ప్రధాన రాజకీయ నాయకుడు మెహతా.

సంజయ్ గాంధీః

జూన్ 23, 1980న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు, పార్లమెంటు సభ్యులు సంజయ్ గాంధీ ఢిల్లీలో విమాన ప్రయాణం చేయడానికి బయలుదేరారు. ఆయనకు విమాన ప్రయాణం అంటే చాలా మక్కువ. ఉదయం 10 గంటలకు, ఆయన విమానం స్టంట్ చేస్తుండగా కూలిపోయింది. సంజయ్, ఆయన సహ ప్రయాణీకుడు సుభాష్ సక్సేనా కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

మాధవరావు సింధియాః

ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా కూడా విమాన ప్రమాదంలో మరణించారు. సెప్టెంబర్ 30, 2001న, సింధియా కాన్పూర్‌లో ఒక ర్యాలీలో పాల్గొనడానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన విమానం మెయిన్‌పురిలోని మోటగావ్ సమీపంలో కూలిపోయింది. ఆ సమయంలో సింధియా వయస్సు 56 సంవత్సరాలు.

జి.ఎం.సి. బాలయోగిః

గంటి మోహన చంద్ర బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేస్తున్నప్పుడు మరణించారు. బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 2002లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళుతుండగా, ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. బాలయోగి తోపాటు ఆయన భద్రతా అధికారి డి. సత్య రాజు, పైలట్ కెప్టెన్ జి.వి. మీనన్ అక్కడికక్కడే మరణించారు.

వై.ఎస్. రాజశేఖర రెడ్డిః

2009లో ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం. ఈసారి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని వెంటాడిన మృత్యువు. సెప్టెంబర్ 2009లో రాజశేఖర రెడ్డి తన అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా ఆయన హెలికాప్టర్ కూలిపోయింది.

విజయ్ రూపానీః

జూన్ 12, 2025న, అహ్మదాబాద్ నుండి బయలుదేరిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విజయ్ రూపానీ కూడా విమానంలో ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి రూపానీ. ఆ సాయంత్రం మరణించిన వారి జాబితా విడుదల చేసినప్పుడు, అందులో విజయ్ రూపానీ పేరు కూడా ఉంది. రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్తున్నాడు.

దోర్జీ ఖండూః

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ కూడా 2011లో విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి ఖండూ వయస్సు 56 సంవత్సరాలు. ఖండూ తవాంగ్ నుంచి రాజధాని ఇటానగర్‌కు వెళుతుండగా ఆయన విమానం అదృశ్యమైంది.

అజిత్ పవార్ః

తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బారామతికి వెళుతున్నారు. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..