EC Neelam Sahni: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ఒంగోలులో ఓట్ల లెక్కింపు
AP State Election Commissioner Neelam Sahni: ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ఒంగోలులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను నీలం సాహ్ని శనివారం పరిశీలించారు. నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులతో వెలుగు టి.టి.డి.సి. సమావేశ మందిరంలో ఆమె సమావేశమయ్యారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలను నీలం సాహ్ని పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్ వైజర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు సాహ్ని. ముందస్తు శిక్షణలు చాలా కీలకమన్నారు. బ్యాలెట్ బాక్సులు తరలింపు, బ్యాలెట్ బాక్సులు తెరిచే సమయంలో నిశిత పరిశీలన ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాలన్నింటిపై నియమితులైన నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆమె సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కేంద్రాలలో ఎలాంటి సమస్యలు, ఆటంకాలు ఎదురుకాకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద స్థితిలో ఉన్న వారు, అనవసరమైనవారు సంచరించకుండా చూడాలని నీలం సాహ్ని అధికార్లని ఆదేశించారు. కేంద్రాల వద్ద బందోబస్తు సి.సి. కెమేరాల నిఘాలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపుపై జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళికను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధలు పాటిస్తూ టీకా రెండు డోసులు వేయించుకున్న వారికే విధుల్లోకి అనుమతించాలని చెప్పారు.
బ్యాలెట్ పత్రాల లెక్కింపులో ఏదైనా ఆటంకాలు, అవాంతరాలు ఎదురైతే ఆర్.ఓ.లు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్‌ఇసి నీలం సాహ్నికి వివరించారు… జిల్లాలో 41 జడ్.పి.టి.సి. స్థానాలు, 367 ఎమ్.పి.టి.సి. స్థానాలకు 8.99 లక్షల ఓట్లు పోలయ్యాయని, 51.68 శాతం పోలింగ్ జరిగిందన్నారు. 27 స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన 52 మండలాలకు సంబంధిచిన 2,223 బ్యాలెట్ బాక్సులను 12 కౌంటింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 109 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు నీలం సాహ్ని.
మొత్తంగా 52 మంది రిటర్నింగ్ అధికారులు, 110 సహాయ రిటర్నింగ్ అధికారులు, 679 కౌంటింగ్ సూపర్ వైజర్లు, 2,443 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి నియోజక వర్గానికి చెందిన కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక జిల్లా అధికారి చొప్పున 12 మంది ప్రత్యేక అధికారులను నియమించామని ఆయన వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పక్కాగా అమలయ్యేలా 15 మంది జిల్లా అధికారులు నిశిత పరిశీలన చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
లెక్కింపు కేంద్రాలలో బారికేడ్లు, ఇనుప కంచె, కుర్చీలు, టేబుల్స్, రిజల్ట్ షీట్ బోర్డులు, విద్యుద్దీకరణ, జనరేటర్లు, సి.సి.టీవీలు, వీడియోగ్రఫి, కేంద్రం వెలుపల డిస్ ప్లే బోర్డులు, అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు విధులలో ఉండేవారికి త్రాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిగంటకు లెక్కింపు సమాచారం విడుదల చేసేలా మీడియా సెల్ ఏర్పాటు చేశామమని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి