పొదల మాటున గుంపుగా కూడిన జనం.. పోలీస్ డ్రోన్ వెళ్లి చూడగా షాక్..!
తిరుపతి జిల్లా పోలీసుల డ్రోన్లు వదలబొమ్మాలి వదలంటున్నాయి.. అసాంఘిక కార్య కలాపాలపై కొరడా జులిపిస్తున్నాయి. పేకాట శిబిరాలు, గంజాయి, మత్తు ఇంజక్షన్లు వాడే వారిని జల్లేడు పట్టే ప్రయత్నం చేస్తున్న డ్రోన్లు హడలెత్తిస్తున్నాయి. తాజాగా రేణుగుంట సబ్ డివిజన్‌లో డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించారు పోలీసులు. మేర్లపాక, బందారుపల్లె, ముసలిపేడు, కందాడు, రామలింగాపురం పరిసరాల్లో డ్రోన్ ఎగురవేశారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యాధునిక ఆయుధాన్ని బయటకు తీశారు. దీంతో నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నేరాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. పలు జిల్లాల్లో పేకాట రాయుళ్ల ఆచూకీ, నాటు సారా తయారీ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలను ఈ డ్రోన్ల సాయంతో పోలీసులు కనిపెడుతున్నారు. తిరుపతి పోలీసులు ఇటీవల నాటు సారా తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో చాటుమాటు వ్యవహారాన్ని ఛేదించారు.
తిరుపతి జిల్లా పోలీసుల డ్రోన్లు వదలబొమ్మాలి వదలంటున్నాయి.. అసాంఘిక కార్య కలాపాలపై కొరడా జులిపిస్తున్నాయి. పేకాట శిబిరాలు, గంజాయి, మత్తు ఇంజక్షన్లు వాడే వారిని జల్లేడు పట్టే ప్రయత్నం చేస్తున్న డ్రోన్లు హడలెత్తిస్తున్నాయి. తాజాగా రేణుగుంట సబ్ డివిజన్‌లో డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించారు పోలీసులు. మేర్లపాక, బందారుపల్లె, ముసలిపేడు, కందాడు, రామలింగాపురం పరిసరాల్లో డ్రోన్ ఎగురవేశారు.
ముసలిపేడు వద్ద పొలాల్లో గుంపులుగా కూర్చొన్న గ్యాంగ్ ఒకటి పోలీసుల కంటపడింది. పేకాట ఆడుతున్నట్లు అనుమానించిన పోలీసులు.. డ్రోన్ కెమెరాను జూమ్ చేసి చూశారు. ఇంకేముందీ.. పేకాట ఆడుతూ ఆధారాలతో సహా దొరికిపోయారు. డ్రోన్ గుర్తించిన ప్రాంతానికి చేరుకున్న ఏర్పేడు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు. 10 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఇన్స్‌పెక్టర్ వినోద్ కుమార పేకాట శిబిరంపై దాడి చేశారు. పోలీసుల రాకతో పేకాట రాయుళ్లు పారిపోయే ప్రయత్నం చేశారు.
పేకాట శిబిరం వద్దకు ఎవరు రాకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్న పేకాట రాయుళ్ళు.. ఇందుకోసం ఇన్‌ఫార్మర్స్‌ను కూడా నియమించుకున్నారు. పచ్చని పొలాల మధ్య పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పేకాట అడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 9 మంది పరారీ కాగా, వారి కోసం ప్రత్యేక బృందాతో గాలిస్తున్నారు. ఇక పట్టుబడ్డ పేకాటరాయుళ్ల నుంచి రూ 2.36 లక్షల నగదు, 12 సెల్ ఫోన్స్, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.
పేకాట ఆడుతున్న వారిలో తిరుపతికి చెందిన ఇద్దరు, కడపజిల్లాకు చెందిన ఐదు మంది, అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఇద్దరు, కోడూరు, కలకడకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..