AP and TS Politics: ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటర్.. కేంద్రంపై కోపాన్ని ఏపీపై చూపిస్తున్నారని చురకలు..
నిధుల్లేక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద భిక్షమెత్తుకుంటున్నారన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కౌంటర్ ఇచ్చారు

నిధుల్లేక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద భిక్షమెత్తుకుంటున్నారన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధులనే అడుగుతున్నామని ఇందులో దాపరికమేమీ లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జగన్ గురించి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటి మాటికీ దిల్లీ వెళ్తున్న కేసీఆర్ ఏం భిక్షమెత్తుకుంటున్నాడని ఎద్దేవా చేశారు . కేంద్ర క్యాబినేట్ లో చేరుతున్నాం.. అందుకే దేశ రాజధానికి వెళ్తున్నామని ఎందుకు చెప్పుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు.
హైదరాబాద్‌ను అప్పుల పాలు చేశారు.. బయట కాలర్ ఎగురవేసి.. లోపల కాళ్లు పట్టుకునే అలవాటు జగన్ కి లేదని పేర్నినాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర బాగా డబ్బులుంటే .. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై మాట్లాడాలని ఆయన ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్ముని ఇప్పుడు అనుభవిస్తున్నారని, అందరం కలిసి పాడి కుండని అప్పగిస్తే అప్పులు పాలు చేశారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ మంత్రికి కేంద్రంపై కోపం ఉండే దిల్లీ వెళ్లి ఏడవాలని..ఏపీపై పడి ఎందుకు ఏడుస్తున్నారని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీ నాయకులను తిరగనివ్వం.. కాగా అంతకుముందు కేంద్రం వరిధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ధర్నాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న ఆంధ్రోళ్లు ఇప్పుడు అడుక్కు తింటున్నారని, ఏపీ సీఎం జగన్ అందుకే దిల్లీ వెళుతున్నారన్నారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో మీటర్లు పెట్టారని మంత్రి పేర్కొన్నారు.. ఇక రాష్ట్రంలోని బీజేపీ నాయకుల వల్ల రాజకీయ నాయకులకు గౌరవం లేకుండా పోతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రకరకాల పంటలు పండుతాయి… అన్ని రకాల పంటలను కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. వర్షాకాలం వరి ధాన్యం కోటి మెట్రిక్ టన్ను లు కొంటామన్న కేంద్రం కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. బండి సంజయ్ కు దమ్ముంటే 40 మెట్రిక్ టన్నులు కొంటామని కేంద్రం నుంచి లెటర్ తీసుకొని రావాలని సవాల్ విసిరారు. లేదంటే బీజేపీ నాయకులను ఊర్లలో తిరగనీయమని హెచ్చరించారు.కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిందని, కానీ రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు మీటర్లు పెట్టాల్సిన సమయం వచ్చిందని మంత్రి విమర్శించారు. రైతుల డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read:
Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు
Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..
Weather Alert: మరో మూడు రోజుల పాటు జోరు వానలు.. తాజా హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ