Andhra Pradesh: ఏపీ మంత్రి కొడాలి నానితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు.. కారణం అదేనా..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఓ మంత్రితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచుతూ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
AP Minister and 3 MLAs Security increased: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఓ మంత్రితో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచుతూ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి భద్రత పెంచుతూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
కొడాలి నానికి ప్రస్తుతమున్న వై కేటగిరీ భద్రతతో పాటు అదనంగా మరో నలుగురు భద్రతా సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆడిషన్ డీజీ ఇంటలిజెన్స్ పేరుతో విడుదలైన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కొడాలి నానికి 13 మందితో భద్రత కల్పిస్తుండగా.. తాజాగా ఈ సంఖ్యను 17కు చేరుకోనుంది. అలాగే, ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు 1+1గా ఉన్న భద్రతను 4+4గా మార్చారు. ఈ మేరకు సంబంధిత జిల్లా ఎస్పీలు, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా అడ్డుతగిలిన ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు నలుగురు వైసీపీ నేతలపై గుర్రుగా ఉన్నారు. దీంతో వీరిపై దాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో పాటు, కొందరికి ఫోన్లలో బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం మంత్రి కొడాలి నానితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also… Farm Laws: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు!