Andhra Pradesh: ఆ పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి… హెడ్ మాస్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..
జ్వరం, దగ్గు, జలుబుతో సతమతమవుతున్న బాధితులు రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు. H3N2 వైరస్ దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
H3N2 వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లేపుతోంది. ఇది వందేళ్ల నాటి వైరస్. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అవుతూ వస్తుంది. ఇది జనవరిలోనే స్టార్టయ్యింది. ఇప్పుడు పీక్‌కి చేరింది. చాలామంది దీని బారిన పడి కోలకున్నారు. మనిషిలోకి ఎంటరయ్యాక సత్తువ లేకుండా చేస్తుంది ఈ వైరస్. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఫీవర్ కూడా రావొచ్చు. అన్నీ తగ్గినా… దగ్గు మాత్రం 2, 3 వారాలు వెంటాడుతుంది. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో గతంలో వచ్చి పోయిందన్నారు. ప్రజంట్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో ఎక్కువగా కన్పిస్తోందన్నారు. ముక్కు నుంచి గొంతు వరకు దీనిప్రభావం ఉంటుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోందని వెల్లడించారు. మొదటి మూడు, అయిదు రోజులు జ్వరం వస్తుందని తెలిపారు.
చిన్నారులు, వృద్దులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ వైరస్ సోకితే విద్యార్థులను స్కూళ్లకి పంపవద్దని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు, నీరసంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులు బడులకు పంపొద్దని కోరారు. వారికి సెలవులు ఇవ్వాలని పాఠశాలల హెచ్ఎంలకు సూచించారు. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవాలని.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని…రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుందిని తెలిపారు. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు.
హాట్ వాటర్ తాగడం, వేడి నీటిలో ఉప్పు వేసి గొంతులో పోసుకొని పుక్కిలించడం, పసుపు అల్లం కషాయం టీ కప్పులో నాలుగు రోజులు వేసుకోవడం… బాగా వాటర్ తాగుతూ.. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటూ దీని నుంచి బయటపడొచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..