AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Engineering Counselling: ఏపీలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు ? తీవ్ర గందరగోళంలో స్టూడెంట్స్

ఏపీలో ఎంసెట్‌ ఫలితాలు విడుదలై నెలరోజులు గడుస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఆగస్ట్‌ 25న ఈఏపీసెట్‌ నిర్వహించింది ప్రభుత్వం.

AP Engineering Counselling: ఏపీలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు ? తీవ్ర గందరగోళంలో స్టూడెంట్స్
Ap Engineering Counselling
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2021 | 10:21 AM

Share

ఏపీలో ఎంసెట్‌ ఫలితాలు విడుదలై నెలరోజులు గడుస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ఆగస్ట్‌ 25న ఈఏపీసెట్‌ నిర్వహించింది ప్రభుత్వం. సెప్టెంబర్‌ 8న ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్‌ వచ్చిన పది రోజుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అయితే ఇప్పటికి నెలరోజులు గడుస్తున్నా అడ్మిషన్లు మొదలు కాకపోవడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏపీలో లక్షా 66 వేల 460 మంది విద్యార్థులు ఈఏపీసెట్‌ ఎంట్రెన్స్‌ రాశారు. వీరిలో లక్షా 34 వేల 205 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ విభాగానికి అర్హత సాధించారు. అయితే గత ఏడాది 281 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజులను నిర్థారణ కాగా .. ఈ ఏడాది మాత్రం అఫిలియేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో క్లాసులు ప్రారంభం కావడంతో చాలా మంది విద్యార్థులు అక్కడికి తరలి వెళుతున్నారు. అయితే ఫీ రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులు మాత్రం అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు డిగ్రీ అడ్మిషన్లు కూడా పూర్తి కానుండటంతో ఇంజనీరింగ్‌లో సీటు రాకుంటే కనీసం డిగ్రీలో కూడా జాయిన్‌ కాలేని పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల జాప్యానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడ్మిషన్లు ప్రారంభించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్టం ప్రకారం ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దీంతో ఈ యూనివర్సిటీల్లో ఫీజుల నిర్థారణ కోసం కసరత్తు జరుగుతోంది. మొత్తం 5 యూనివర్సిటీల్లో ప్రభుత్వానికి కేటాయించే సీట్ల కోసం ఎంత ఫీజు ఉండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం అయినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. 3 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించి సీట్లు కేటాయిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాకినాడ, అనంతపురం JNTU ల నుంచి ఆయా కాలేజీలకు సంబంధించిన గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడమే ఆలస్యానికి కారణం అంటున్నారు అధికారులు.

అన్ని వర్గాల వారికి ఇంజనీరింగ్‌ విద్య అందించాలని సీఎం జగన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని యూనివర్సిటీల నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Also Read: వామ్మో పెద్ద సమస్యే.. ‘కరెంట్ పోతే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎలా చూడాలి ?’