Pawan Kalyan: చెట్టు నరికితే తాట తీస్తా.. వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్బగ్లింగ్ ఆపకపోతే తాట తీస్తామన్న వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే స్పెషల్ ఆపరేషన్‌తో కింగ్ పిన్స్‌ను ఏరి పారేసేందుకు సిద్ధమైన సర్కార్ 6 నెలల్లో యాక్షన్ లోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శేషాచలం అడవుల్లో పర్యటించారు. అక్కడి చెట్లను పరిశీలించారు. ఎవరైనా స్మగ్లింక్ చేస్తే తాట తీస్తామన్నారు.

శేషాచలం అడవులు. తూర్పు కనుమల్లో అంతర్భాగం. అరుదైన వృక్ష సంపదకు నిలయం. దాదాపు లక్ష 25 వేల హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. శేషాచలంలోని తిరుమల గిరుల్లో మాత్రమే లభించే ఖరీదైన మేలురకం ఎర్రచందనం ఇప్పుడు కనుమరుగైపోయితోంది. అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం విస్తారంగా ఉన్న కొండల్లో పచ్చదనాన్ని జీవవైవిద్యాన్ని పరిరక్షించే పనిలో పడ్డ ఏపీ సర్కార్ ఎర్రచందనం స్మగ్గింగ్ పై ఫోకస్ చేసింది. విలువైన సంపద ఖాళీ అవుతోందని గుర్తించిన అటవీ శాఖ ఎర్రచందనం స్మగ్లింగ్ కు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే పట్టుబడ్డ ఎర్రచందనమును అమ్మి ఖజానా నింపుకోవడంతోపాటు మరోవైపు విశేషాలు ఉన్న ఎర్రచందనం సంపదను కాపాడుకునేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.
గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఎర్రచందనంను గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తూ అమ్మకాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతిలోని ఎర్రచందనం గోదాముల్లో సుమారు 5,376 మెట్రిక్ టన్నుల రెడ్ శాండిల్ నిల్వ ఉండగా 2025 ఫిబ్రవరి నుంచి పలు విడతల్లో వేలం ద్వారా విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మొదటి విడతలో 906 మెట్రిక్ టన్నులను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం ఏ,బీ,సీ గ్రేడ్ లలో రెడ్ శాండిల్ అమ్మకాలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రెడ్ శాండిల్ కు ఉన్న డిమాండును పరిగణలోకి తీసుకొని ఎంఎస్ టీసీ ద్వారా ఎర్రచందనం టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తోంది. గ్లోబల్ టెండర్ల లో విదేశీ ట్రేడింగ్ కంపెనీలు పాల్గొంటున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోడ్ చేసిన ధరకు కొనుగోలు చేసేందుకు ట్రేడర్లు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగకపోగా అటవీ శాఖ గోదాముల్లో భారీగా ఎర్రచందనం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ.3 వేల కోట్ల మేర ఆదాయం అంచనాతో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే 11,806 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎక్స్ పోర్టు కు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది.
పదేళ్ల క్రితం ఏ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్ను ధర రూ.52 లక్షలు, బీ గ్రేడ్ ధర రూ.38 లక్షలు, సీ గ్రేడ్ ధర రూ. 21 లక్షలు ఉండగా.. ఎర్రచందనం పై ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిరోధించడం తోపాటు, పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఎర్ర చందనంపై స్పెషల్ ఫోకస్ పెట్టానన్న డిప్యూటీ సీఎం పవన్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో భారీగా ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందని అభిప్రాయ పడ్డారు. అటవీ శాఖ సమర్పించిన నివేదికపై చర్చించిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.
కింగ్ పిన్స్‌కు పవన్ వార్నింగ్
ఏపీ నుంచి తరలిపోయిన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడిందన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనంను అమ్మి కర్ణాటక సర్కారు రూ.140 కోట్ల సొమ్ము చేసుకుందన్నారు పవన్ కళ్యాణ్. అప్పుడున్న మంత్రులు ఎవరూ బాధ్యతలు తీసుకోలేదన్న పవన్.. ఇప్పుడు 5 జిల్లాల ఎస్పీలకు, అటవీ శాఖ అధికారులకు టాస్క్ ఇచ్చారు. ఎవరి ఊహలకు అందనంత సొత్తు ఎర్ర చందనం ద్వారా దోచుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. శేషాచలంలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయాయన్నారు. ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయం కావాలన్నారు. అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని, ఎక్కడ రెడ్ శాండిల్ దొరికినా అది మనకు చెందేలా ఒప్పందం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్.
ఉమ్మడి కడప జిల్లాలో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చిన అటవీశాఖ ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్ లను గుర్తించింది. కింగ్ పిన్స్ ను త్వరలో పట్టుకుంటామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మెరకు కార్యాచరణ రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఎర్ర చందనం చెట్లు నరికే వృత్తిలోకి ఎవ్వరు వెళ్ళకండన్నారు. తమిళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నానన్నారు. ఎవరైనా స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తానన్న వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్ లాంటి ఆపరేషన్ తప్పదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
