Pawan Kalyan: జాతీయ భాషా విధానం, జనసేన వైఖరిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
హిందీని బలవంతంగా అమలు చేస్తున్నారని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. NEP 2020 ప్రకారం, విద్యార్థులు మాతృ భాషతో పాటు రెండు భారతీయ భాషలు, ఒక విదేశీ భాష నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఉందని పవన్ గుర్తు చేశారు. హిందీ చదవాలని కోరుకోకపోతే ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని సూచించారు.

తమిళనాట హిందీకి వ్యతిరేకంగా డీఎంకే ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిందీ ఇష్టం లేకపోతే.. తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాది వాళ్ల డబ్బులు కావాలి కాని.. హిందీ అవసరం లేదంటే కుదరదన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో డీఎంకే నుంచి కౌంటర్లు వస్తున్నాయి. గతంలో హిందీని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపారని డీఎంకే ఎంపీ కనిమొళి ట్వీట్ చేశారు.
తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా , ద్విభాషా విధానానికి మద్దతుగా పవన్ కల్యాణ్ పుట్టక ముందే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్. పవన్ కల్యాన్ నటుడు మాత్రమే అని.. రాజకీయ నేత కాదన్నారు. ఒకవేళ తమిళ డబ్ సినిమాలు ఇష్టం లేకపోతే ఉత్తరాది ప్రజలు చూడరన్నారు. డీఎంకే చట్టాన్ని గౌరవిస్తుందని, చట్టాన్ని గౌరవించని బీజేపీకి మద్దతు ఇచ్చే పవన్ కల్యాణ్‌లా తమ నేతలు లేరని అన్నారు.
అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు పవన్ కల్యాణ్. హిందీని తాను ఎప్పుడు వ్యతిరేకించలేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకించినట్టు చెప్పారు. బహు భాషా విధానం జాతి సమగ్రతకు దోహదం చేస్తుందన్నారు. ఒక భాషను బలవంతంగా రుద్దడమో, మరో భాషను అర్థం లేకుండా వ్యతిరేకించడం వల్ల ప్రయోజనం లభించదన్నారు. జాతీయ విద్యా విధానం 2020 లో హిందీని బలవంతంగా నేర్పించాలనే నిబంధన లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.
అయినా, హిందీని బలవంతంగా అమలు చేస్తున్నారని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని పవన్ అభిప్రాయపడ్డారు. NEP 2020 ప్రకారం, విద్యార్థులు మాతృ భాషతో పాటు రెండు భారతీయ భాషలు, ఒక విదేశీ భాష నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఉందని పవన్ గుర్తు చేశారు. హిందీ చదవాలని కోరుకోకపోతే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైతిలీ, మైతే, నేపాలి, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని సూచించారు. ఈ బహుభాషా విధానం విద్యార్థులకు స్వేచ్ఛ తో పాటు జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి రూపొందించిందని పవన్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని వక్రీకరించడం, గత వైఖరిని మార్చుకున్నారని దుష్ప్రచారం చేయడం అర్థరహితమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ஒரு மொழியை கட்டாயமாக திணிப்பதும், ஒரு மொழியை கண்மூடித்தனமாக எதிர்ப்பதும்—இவை இரண்டுமே இந்தியாவின் தேசிய ஒருமைப்பாட்டிற்கு உகந்தவை அல்ல.
நான் ஹிந்தியை ஒரு மொழியாக ஒருபோதும் எதிர்க்கவில்லை. ஆனால், அதை கட்டாயமாக்குவதற்காக முன்பு எடுக்கப்பட்ட முயற்சிக்கு மட்டுமே எதிர்ப்பு…
— Pawan Kalyan (@PawanKalyan) March 15, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..