Andhra Pradesh: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో కొనసాగుతున్న చర్యలు.. ఢిల్లీలో ఇద్దరి అరెస్ట్..
గత ప్రభుత్వంలో జరిగింది స్కిల్ డెవలప్‌మెంటా? లేక స్కామ్ డెవలప్‌మెంటా? అప్పుడెప్పుడో జరిగిన ఈ డీలింగ్స్‌పై ఇప్పుడెందుకు అరెస్టులు జరుగుతున్నాయి?
AP Skill Development Scam: టీడీపీ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ పోలీసులు ఢిల్లీలో నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. CA విపిన్ కుమార్‌తో పాటు ఆయన భార్య నీలం శర్మను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. సెప్టెంబరు 7 వరకు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. గత టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 2014–15 మధ్య సీమెన్స్ ఇండియా కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. 3,300 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌కు సెంటర్స్‌ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రాజెక్టుపై ప్రతిపాదన సమర్పించింది. 90 శాతం గ్రాంట్, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రతిపాదించింది. అయితే కనీస పరిశీలన, నిర్ధారణ లేకుండానే గత ప్రభుత్వం ఒకే చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. అదీకాక ప్రాజెక్టు పనులు మొదలు కాకముందే అడ్వాన్స్ కింద 370 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈ కేసులోనే ఢిల్లీలో సీఏ దంపతుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో వందల కోట్ల రూపాయల స్కామ్ చేసిందెవరు? వాళ్ల వెనుక ఉన్నదెవరు? ఇదే ఇప్పుడు మెయిన్ పాయింట్‌గా మారింది. దాంతో, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అసలు సూత్రధారులెవరో? ఎవరెవరు ఎంతంత నొక్కేశారో తేల్చే పనిలో పడ్డారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి