AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Peddireddy: గ్రామీణ పేదలకు ఉపాధి హమీ కల్పించడంలో ఏపీ అగ్రస్థానమన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇప్పటికి ఎంత వ్యయమైందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది పనిదినాలను గ్రామీణ పేదలకు కల్పించడంలో గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Minister Peddireddy: గ్రామీణ పేదలకు ఉపాధి హమీ కల్పించడంలో ఏపీ అగ్రస్థానమన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇప్పటికి ఎంత వ్యయమైందంటే?
Peddireddy Ramchandra Reddy
Balaraju Goud
|

Updated on: Mar 24, 2022 | 1:38 PM

Share

Minister Peddireddy Ramchandra Reddy in Assembly: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం(NREGS Scheme) ద్వారా కోట్లాది పనిదినాలను గ్రామీణ పేదలకు కల్పించడంలో గ్రామీణాభివృద్ధి(Rural Development) శాఖ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శాసనసభలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లేబర్ బడ్జెట్ 23.50 కోట్ల పనిదినాలకు గాను, ఇప్పటి వరకు 22.45 కోట్ల పని దినాలను వినియోగించుకున్నామని తెలిపారు. ఇందులో ఎస్సీలకు 5.20 కోట్లు అంటే 23.58 శాతం, ఎస్టీలకు 2.26 కోట్లు అంటే 10.14 శాతం, మహిళలకు 14.82 కోట్లు అంటే 57.26 శాతం పనిదినాలను కల్పించామన్నారు. 45.83 లక్షల కుటుంబాల నుంచి 75.32 లక్షల మంది వేతన దారులకు ఉపాధి కల్పించామని మంత్రి వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ.7,507.54 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. ఇందులో రూ. 4,908.19 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు అందించడం జరిగిందన్నారు. మరో రూ.2,504.65 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఖర్చు చేశామని తెలిపారు. 3,82,130 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని పూర్తిగా వినియోగించుకున్నాయని, పని చేసిన పదిహేను రోజుల్లోనూ 99.27 శాతం చెల్లింపులు చేశామని తెలిపారు.

మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పనులు: రాష్ట్రంలో 10,897 గ్రామ సచివాలయం భవనాలను రూ.4201 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామని, ఇప్పటి వరకు రూ.1872.53 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే రూ.2,269 కోట్ల అంచనా వ్యయంతో 10,315 రైతు భరోసా కేంద్రాలు చేపట్టామని, ఇప్పటివరకు రూ.781.12 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ. 751 కోట్ల అంచనా వ్యయంతో 8,509 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు చేపట్టాగా, ఇప్పటి వరకు రూ. 203 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ. 416 కోట్ల అంచనా వ్యయంతో మొదటి దశ కింద 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు చేపట్టగా, ఇప్పటివరకు రూ.22.39 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.751 కోట్ల అంచనా వ్యయంతో 4,454 వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు కూడా చేపట్టామని తెలిపారు. ఉపాధి హామీ చట్టం లొ నిర్దేశించిన ప్రకారం, మొత్తం వ్యయంలో సహజ వనరుల అభివృద్ధి (NRM) పనులకు 65 శాతంకి గాను 68.51శాతం ఖర్చు చేశామని, అలాగే మొత్తం వ్యయంలో వ్యవసాయం, అనుబంధ పనులకు నిర్దేశించిన 60శాతంకి గాను 65.41 శాతం ఖర్చు చేశామని తెలపారు. రూ.3,079.56 కోట్ల వ్యయంతో 2,01,775 వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణపు పనులు చేపట్టామని, రూ.81.54 కోట్ల వ్యయంతో 22,717 నేల తేమ సంరక్షణ (SMC) పనులు చేపట్టామని తెలిపారు.

జగనన్న పచ్చతోరణం: జగనన్న పచ్చ తోరణం కింద, 65.82 లక్షల మొక్కలతో 16,462 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్, 55.93 లక్షల మొక్కలతో 37.455 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 54,566 ఎకరాల ఉద్యానవన తోటలు చేపట్టిని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వo, 2021-22 ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్‌ను 23.50 కోట్ల పనిదినాల నుండి 26 కోట్లకు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని తెలిపారు.

ఉపాధి హామీ పధకం పురోగతి సహజ వనరుల యాజమాన్యంకు సంబంధించిన పనుల కోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం వ్యక్తిగత ఆస్తుల కోసం రూ.1,126.53 కోట్లు ఖర్చు చేశామని మంత్రి అన్నారు. ఎస్‌హెచ్‌జి గ్రూపుల మౌలిక సదుపాయాల కోసం రూ.7.63 కోట్లు ఖర్చు చేశామని, గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం రూ.2973 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మొత్తంగా రూ.7413.16 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ సామాజిక తనిఖీ నివేదిక ప్రకారం 2014-19 వరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగంపై 1,19,964 కేసులు నమోదయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ అభియోగాల్లో మొత్తం రూ. 261.34 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు తేలిందని అన్నారు. 2019 నుంచి నేటి వరకు మొత్తం 24,789 ఫిర్యాదులు రాగా దానిలో రూ. 52.43 కోట్లు దుర్వినియోగం అయినట్లు అభియోగాలు వచ్చాయని తెలిపారు. ఉపాధి హామీలో అక్రమాలు, అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అంబుడ్స్ మెన్ వ్యవస్థను పటిష్టం చేశామని, నిధుల వినియోగంపై పూర్తి పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, ఫిర్యాదులపై తక్షణం స్పందించి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

  1. శాసనసభలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన వివరాలు…
  2. ఉపాధి హామీ కింద ఈ ఏడాది రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలు: 23.50 కోట్లు
  3. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన పనిదినాలు : 22.45 కోట్లు
  4. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ కింద చేసిన వ్యయం : రూ.7507.54 కోట్లు
  5. వేతనాల రూపంలో కూలీలకు అందించినది : రూ.4908.19 కోట్లు
  6. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసింది : రూ. 2504.65 కోట్లు
  7. 3,82,130 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని అందించాం
  8. 15 రోజులలోపే 99.27 శాతం చెల్లింపులు
  9. రూ.4201 కోట్ల అంచనా వ్యయంతో 10,897 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం
  10. రూ.2269 కోట్ల అంచనా వ్యయంతో 10,315 ఆర్బీకేల నిర్మాణం
  11. రూ. 751 కోట్ల అంచనా వ్యయంతో 8,509 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం
  12. రూ. 416 కోట్ల అంచనా వ్యయంతో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు
  13. రూ.751 కోట్ల అంచనా వ్యయంతో 4,454 వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు
  14. రూ.3079.56 కోట్ల వ్యయంతో 2,01,775 వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు
  15. జగనన్న పచ్చ తోరణం కింద, 65.82 లక్షల మొక్కలతో 16,462 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్
  16. 55.93 లక్షల మొక్కలతో 37455 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 54566 ఎకరాల ఉద్యానవన తోటలు

Read Also….

AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. ఈనెల 28న హాజరు కావాలని ఆదేశం