Annadata Sukhibhava: ఏపీ రైతన్నలకు పండుగలాంటి వార్త.. ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు.
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా జమ కానున్నాయి. కేంద్రం ఇచ్చే రూ.2 వేల పీఎం కిసాన్ సాయంతో కలిపి ఒక్కో రైతుకు నేటే మొత్తం రూ.7,000 చొప్పున డబ్బులు పడనున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
రైతుల చేతికి డబ్బు చేర్చడమే కాకుండా, సాగునీటి ఎద్దడి, ఎరువుల కొరత ఏర్పడకుండా చూసే బాధ్యతను కూడా అధికారులపై పెట్టారు సీఎం చంద్రబాబు. గురువారం(జూలై 31) సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. “రైతులకు చేయూత భారం కాదు.. బాధ్యత” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్నదాతలకు సాయం చేసేటప్పుడు వ్యవస్థ మొత్తం సమర్థంగా పనిచేయాలని, వారి ఖాతాలు యాక్టివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ‘మనమిత్ర’ ద్వారా రైతుల సెల్‌ఫోన్లకు ముందుగానే సమాచారం పంపించారు. సందేహాల నివృత్తి కోసం 155251 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచారు.
పండుగలా పథకం ప్రారంభం
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. గ్రామ సచివాలయాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాల వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. “చేసిన మేలును ప్రజలకు చెప్పండి. ప్రభుత్వ పాలసీలు అధికారులు సమర్థంగా అమలు చేయాలి. ప్రజల విశ్వాసం నిలబెట్టుకున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20,000 సాయం
ఈ పథకంతో రైతుకు ఏడాదికి మొత్తం రూ.20,000 పెట్టుబడి సాయం లభించనుంది. ఇందులో కేంద్రం రూ.6,000 (ప్రతి విడతకు రూ.2,000), రాష్ట్రం రూ.14,000 (రూ.5,000 + రూ.5,000 + రూ.4,000) చొప్పున మూడు విడతలుగా ఇవ్వనుంది. ఈ ఏడాది తొలి విడత నేటి నుంచే అమలు కాగా, కేంద్రం మొదటి విడత పీఎం కిసాన్ ద్వారా మరో రూ.831.51 కోట్లు విడుదల చేయనుంది. ఇప్పటివరకు 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా, వాటిలో 58,464 సమస్యలు పరిష్కరించారు.
ఎన్నికల నియమావళి ఉన్న చోట డబ్బులు ఇవ్వద్దు
ఎస్‌ఈసీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో పథకాన్ని అమలు చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లు, అలాగే కొండపి, కడియపులంక పంచాయతీలు, రామకుప్పం, విడవలూరు, కారంపూడి మండలాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని కమిషనర్ నీలం సాహ్ని సూచించారు. అయితే, పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయొచ్చని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
