Andhra Pradesh: ఏపీ మహిళలకు పండగే పండగ.. ఆ రోజు రానే వచ్చేసింది..!
ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఎంపిక చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న ఈ పథకం, టిడిపి సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి.

ఈ ఇండిపెండెన్స్ డే డబుల్ సెలబ్రేషన్‌కు వేదిక కాబోతోంది. జాతీయ పండుగ ఉత్సాహంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరో పెద్ద బహుమతి రాబోతోంది. ఆగస్టు 15, శుక్రవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ఏపీలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు కొన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (ఆర్టీసీ టెర్మినల్) వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేసి.. సిటీ బస్టాండ్ నుంచి ఉండవల్లి, తాడేపల్లి మీదుగా తిరిగి బస్టాండ్‌కు చేరుకుంటారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే, అంటే సాయంత్రం 5 గంటల నుంచి, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం మొదలవుతుంది.
ఎవరికి వర్తిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు అర్హులు. ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే ఆధార్, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపాలి.
ఏ బస్సుల్లో ఉచితం?
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్. ప్రత్యేక, లగ్జరీ, ఏసీ, గరిష్ట ఛార్జీ, టూరిజం స్పెషల్ బస్సులకు ఇది వర్తించదు.
లబ్ధి ఎలా పొందాలి?
ఆధార్ లాంటి గుర్తింపు పత్రం చూపగానే కండక్టర్ నుంచి జీరో ఫేర్ టికెట్ పొందవచ్చు. అందులో ప్రయాణ వివరాలు రికార్డు చేయడం, టికెట్ తప్పనిసరిగా ఇవ్వడం.. APSRTC మార్గదర్శకాల ప్రకారం అమలు అవుతుంది. మహిళల భద్రత, మర్యాదా ప్రవర్తనపై ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి
పథకం సజావుగా నడవడానికి అన్ని విభాగాలు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇది టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి.
ప్రభుత్వ అంచనా
మహిళల ప్రయాణ ఖర్చు తగ్గి, వారి విద్య, ఉద్యోగ, ఆరోగ్య అవసరాలకు సులభమైన రవాణా అందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కుటుంబాల ఖర్చులో గణనీయమైన ఆదా సాధ్యమని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




