AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానికి..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి అమరావతి వాతావరణం కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే.. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలోని పల ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రాలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయన్నారు. ఇవాళ, దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రేపు ఇదే ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎల్లుండి(గురువారం) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని, అలాగే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల పడుతాయన్నారు. గురువారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. కాగా, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు వర్షం వచ్చిన సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.
Also read:
MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు