Amaravati Avakai Festival: అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్.. 3 రోజులు జాతరే!
అమరావతి బ్రాండ్‌ను జాతీయంగా, అంతర్జాతీయంగా బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు తమ తమ పరిధిలో అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆ దిశగా పర్యాటక శాఖ తాజాగా ‘ఆవకాయ’ పేరుతో అమరావతి ఫెస్టివల్‌ను..

అమరావతి, డిసెంబర్ 22: అమరావతి బ్రాండ్‌ను జాతీయంగా, అంతర్జాతీయంగా బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు తమ తమ పరిధిలో అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆ దిశగా పర్యాటక శాఖ తాజాగా ‘ఆవకాయ’ పేరుతో అమరావతి ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. జనవరి 8 నుంచి 10 వరకు సినిమా, కల్చర్, లిటరేచర్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ సరికొత్త కార్యక్రమానికి విజయవాడ–అమరావతి కేంద్రంగా రూపొందించింది.
కలలు , సంస్కృతి, లిటరేచర్ ను ఒకే వేదికపై
తెలుగు నేల నుంచి పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం… అన్నింటినీ ఒకే బహిరంగ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ‘ఆవకాయ’ అని ఏపీ టూరిజం శాఖా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్, లిటరేచర్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
టీం వర్క్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో…
ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో ఈ వేడుక జరగనుంది. సాధారణంగా ఇండోర్ హాల్స్‌కే పరిమితమయ్యే ఇలాంటి కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడమే ‘ఆవకాయ’ ప్రత్యేకత అని మంత్రి వివరించారు. ఈ ఉత్సవం ద్వారా సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే వేదికపైకి తీసుకురానున్నామని తెలిపారు. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు పెద్దపీట వేస్తూ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
మూడు రోజులపాటు…
రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని అమరావతి–విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల దార్శనికతలో భాగంగానే ఈ ఉత్సవానికి రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
వైవిధ్యంగా…
‘ఆవకాయ’ వేడుక ఏపీ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులు, కళాభిమానులకు ఒక పెద్ద వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇది మంచి వేదికగా మారుతుందని చెప్పారు. ఏపీలో పర్యాటక రంగం, ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్‌గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు ‘ఆవకాయ’ ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








