Driving Tips: చలికాలంలో కారు డ్రైవ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
శీతాకాలం పీక్ స్టేజ్ లో ఉంది. తెల్లవారుజామున కురిసే పొగమంచు, మంచు బిందువులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. వాహనదారులకు మాత్రం ఇది సవాలే అని చెప్పాలి. ముఖ్యంగా కారు నడిపేవారు ఈ సీజన్‌లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మంచు వల్ల రోడ్లు సరిగ్గా కనిపించకపోవడం, టైర్ల పట్టు కోల్పోవడం వంటి సమస్యలతో యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. అందుకే శీతాకాలంలో మీ ప్రయాణం సురక్షితంగా సాగాలంటే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి.

శీతాకాలంలో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సాధారణ హెడ్‌లైట్ల కంటే ఫాగ్ లైట్లు బాగా పనిచేస్తాయి. ఎదురుగా వచ్చే వాహనదారులకు మీ కారు కనిపించేలా తక్కువ కాంతితో ఉండే లైట్లను వాడాలి. హై బీమ్ లైట్లు వాడితే మంచులో కాంతి పరావర్తనం చెంది మీకే దారి సరిగ్గా కనిపించదు. కాబట్టి మంచు వల్ల విండ్‌షీల్డ్‌పై పొరలా పేరుకుపోతుంది. కారు వైపర్లు కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్‌లో కొంచెం యాంటీ-ఫ్రీజ్ సొల్యూషన్ కలపడం వల్ల మంచు గడ్డకట్టకుండా ఉంటుంది. లోపల అద్దంపై ఆవిరి రాకుండా ఉండటానికి డీఫాగర్ లేదా ఏసీని ఆన్ చేయాలి
ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు టైర్లలోని గాలి ప్రెజర్ కూడా తగ్గుతుంది. గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై కారు గ్రిప్ తప్పుతుంది. ప్రతి వారం టైర్ ప్రెజర్‌ను చెక్ చేయించుకోవడం ఉత్తమం. బ్రేకింగ్ విషయంలో జాగ్రత్త గా ఉండాలి. మంచు వల్ల రోడ్లు తేమగా, జారేలా ఉంటాయి. ముందు వెళ్తున్న వాహనానికి, మీ కారుకు మధ్య ఎక్కువ దూరం పాటించాలి. సడెన్ బ్రేక్స్ వేయకూడదు. దీనివల్ల కారు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. మెల్లగా బ్రేక్ అప్లై చేయాలి. పాత కాలం కార్లలాగా గంటల తరబడి ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు. కానీ, స్టార్ట్ చేసిన తర్వాత ఒక 30 నుండి 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను ఐడల్‌లో ఉంచితే ఆయిల్ అన్ని భాగాలకు చేరుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా డ్రైవింగ్ మొదలుపెట్టాలి.
లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు కారులో ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. వెచ్చని దుప్పట్లు, టార్చ్ లైట్, పవర్ బ్యాంక్, మంచి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి స్నాక్స్ తో సాధారణ మెడిసిన్ వెంట తీసుకెళ్లాలి. పొగమంచు ఎక్కువగా ఉండి విజిబులిటీ లేకపోతే కారు పక్కన ఆపుకోవాలి. అలా రోడ్డు పక్కన కారు ఆపాల్సి వస్తే, తప్పనిసరిగా హజార్డ్ లైట్లను ఆన్ చేయాలి. వీలైతే రోడ్డుకు వీలైనంత దూరంగా పార్క్ చేయడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




