AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు

చిత్తూరు జిల్లాలో పోలీసుల స్టైల్ మారింది. నేరాలను కట్టడి చేయాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలుపుతున్న పరిస్థితి నెలకొంది. గంగాధర నెల్లూరు పోలీసుల అదుపులో ఉన్న దొంగనోట్ల చలామణి ముఠా ఈ విషయాన్ని బయట పెట్టింది. దొంగ నోట్ల మార్పిడి పేరుతో రూ.10 లక్షలు కొట్టేసిన ముఠా బండారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఠాలో కీలక నిందితులు పోలీసులే కావడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు
Chittoor Police Corruption
Raju M P R
| Edited By: |

Updated on: May 17, 2026 | 11:58 AM

Share

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపిన సంచలన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వెలుగుచూసింది. రూ. 10 లక్షల అసలు కరెన్సీని కొట్టేయడానికి ఓ నిందితుడు, ఇద్దరు పోలీసులు కలిసి వేసిన ‘ఫేక్ రైడ్’ ప్లాన్ రివర్స్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చివరకు పోలీసులు, నిందితుడు సహా అందరూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన సెల్వం అనే వ్యక్తి దొంగ నోట్ల చలామణి ముఠాలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఇతను ఒక డీల్ కుదుర్చుకున్నాడు. రూ. 10 లక్షల అసలు కరెన్సీ ఇస్తే, దానికి బదులుగా రూ. 1 కోటి నకిలీ కరెన్సీ ఇస్తానని నమ్మించాడు. ఒప్పందం ప్రకారం నిన్న సాయంత్రం కృష్ణగిరి వ్యక్తులు రూ. 10 లక్షల నగదుతో గంగాధర నెల్లూరు మండలం బట్టి కండ్రిగ వద్దకు చేరుకున్నారు.

అయితే, సెల్వం వద్ద ఎలాంటి నకిలీ కరెన్సీ లేదు. కేవలం వారి వద్ద ఉన్న రూ. 10 లక్షలను కాజేద్దామని ప్లాన్ చేశాడు. ఇక తమిళనాడు వ్యక్తులు తెచ్చిన రూ.10 లక్షల తీసుకునే క్రమంలో ఒక ఏఎస్ఐ , మరొక ఏఆర్ కానిస్టేబుల్ ఖాకీ యూనిఫాంలో ఎంట్రీ ఇచ్చారు. పోలీసులను చూడగానే భయపడిపోయిన తమిళనాడు ముఠా.. తాము తెచ్చిన రూ. 10 లక్షల అసలు నగదును అక్కడే వదిలేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరారయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వచ్చిన పోలీసులు మరెవరో కాదు, సెల్వం ముందుగానే ప్లాన్ చేసుకున్న అతని గ్యాంగ్ సభ్యులు.

ఇక తమిళనాడు వ్యక్తులు పారిపోగానే సెల్వం, ఆ ఇద్దరు పోలీసులు కలిసి ఆ రూ. 10 లక్షల నగదును తీసుకెళ్లి పంచుకున్నారు. అయితే ఈ విషయం తమ ముగ్గురి తప్ప మరెవరికి తెలియదని అనుకన్నారు. కానీ పోలీసులు వచ్చినప్పటికీ సెల్వంలో ఎలాంటి భయం లేకపోవడంతో తమిళనాడు వ్యక్తులకు అనుమానం వచ్చింది. దీంతో అతనే ఏదో ప్లాన్ చేసి ఉంటాడిని.. తాము మోసపోయామని గ్రహించిన ఆ ముఠా సభ్యులు ధైర్యం చేసి నేరుగా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా పోలీసులకు చెప్పారు. .

తమిళనాడు ముఠా ఫిర్యాదుతో అలర్ట్ అయిన గంగాధర నెల్లూరు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితుడు సెల్వం మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సెల్వం బట్టి కండ్రిగ వద్ద ఉన్న ఒక మామిడి తోపులో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. డబ్బులు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సెల్వం, ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అడ్డుకొని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఖాకీల అసలు బండారం బయటపడింది.

ఇక కేసులో ప్రధాని సూత్రదాని సెల్వమేనని తేలడంతో అతనితో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముఠాలతో పోలీసులకు ఉన్న సంబంధాలు ఏంటి? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us