Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేతది ప్రమాదం కాదు దారుణ హత్యే.. సింగరాయకొండలో ఉద్రికత్త..

హత్యకు గురైన రవితేజ వైసిపి కార్యకర్తగా ఉన్నారు.. ఆయనపై గతంలో రౌడీషీట్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. రవితేజకు వైసిపిలోనే ఉన్న మరికొంతమంది కార్యకర్తలకు మధ్య గొడవులు ఉన్నాయి.. గతంలో ఒకసారి ఇరువర్గాలు ఘర్షణకు దిగారు.

Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేతది ప్రమాదం కాదు దారుణ హత్యే.. సింగరాయకొండలో ఉద్రికత్త..
Ycp Leader Murder In Prakas
Surya Kala

|

Sep 23, 2022 | 4:12 PM

Andhra Pradesh: ప్రకాశంజిల్లా సింగరాయకొండలో హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం ఉద్రికత్తకు దారి తీసింది. సింగరాయకొండ జాతీయ రహదారి కనుమళ్ల దగ్గర నిన్న రాత్రి బైక్ ను లారీతో ఢీకొట్టి యువకుడు రవితేజను ప్రత్యర్దులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో వైసిపి నేత పసుపులేటి రవితేజను లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు ప్రత్యర్దులు.. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని సింగరాయకొండ పోలీసు స్టేషన్ లో ఉంచారు. అయితే ఈ ఘటనపై పోలీసులు 12 గంటల పాటు కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాదితులు, గ్రామస్థులను పియస్‌లో వేచి ఉండేలా చేయడంతో సమస్య పెద్దదైంది.. ఉదయం వరకు వేచి చూసిన మృతుని బంధువులు ఈ కేసును కేవలం యాక్సిడెంట్ గా నమోదు చేసేందుకు తాత్సారం చేస్తున్నారన్న అనుమానంతో ఆందోళనకు దిగారు.. అంతే కాకుండా ఈ హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న కార్తీక్ అనే యువకుడు ఒంగోలు డిఎస్‌పి నాగరాజుకు బంధువు కావడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించారు..

కార్తీక్‌ పేరు లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కొంతమంది ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై వత్తిడి తెస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.. దీంతో పియస్‌ ఎదుట మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.. హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వ్యక్తుల్లో కొందరు పోలీసు స్టేషన్ గోడ దూకి వెళ్లి హత్యకు వినియోగించిన లారీకి నిప్పంటించారు. గమనించిన పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న చలివేంద్రాన్ని తగులబెట్టారు. పట్టణంలోని దుకాణాలను మూసివేయించి ఆందోళన చేశారు.. ఈ సందర్గంగా ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.. రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌ దగ్గరే మృతుని బంధువులు పడిగాపులు పడుతున్నా, పోలీసులు బందోబస్తు నిర్వహించడంలో ఫెయిల్‌ కావడంవల్లే పియస్‌ ఆవరణలో ఉన్న లారిని ఆందోళన చేస్తున్న వారు తగులబెట్టారన్న ఆరోపణలు వచ్చామయి.. దీంతో సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హత్యలో రాజకీయ కోణం: హత్యకు గురైన రవితేజ వైసిపి కార్యకర్తగా ఉన్నారు.. ఆయనపై గతంలో రౌడీషీట్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. రవితేజకు వైసిపిలోనే ఉన్న మరికొంతమంది కార్యకర్తలకు మధ్య గొడవులు ఉన్నాయి.. గతంలో ఒకసారి ఇరువర్గాలు ఘర్షణకు దిగారు.. ఈ నేపద్యంలో వైసిపిలోనే ఉన్న అంబటి అజయ్, మోటుపల్లి గోపి అనే వ్యక్తులు కార్తీక్‌ అనే టిడిపి కార్యకర్తతో కలిసి రవితేజను హత్య చేసేందుకు ప్లాన్‌ చేశారని మృతుని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.. వారం రోజులుగా రెక్కీ చేసిన అనంతరం పకడ్బందీగా ప్లాన్‌ చేసి బైక్‌పై వస్తున్న రవితేజను మూడు కిలోమీటర్లు వెంబడించి కనుమళ్ళ దగ్గర జాతీయ రహదారిపై లారీతో ఢీకొట్టారని, కిందపడిపోయిన రవితేజను లారీతో దారుణంగా తొక్కించడంతో అక్కడికక్కడే రవితేజ చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. రవితేజను లారీతో తొక్కించి పారిపోతున్న వారిని ఆపేందుకు ప్రయత్నించిన తమపై కూడా లారీని పోనిచ్చేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. మరోవైపు రవితేజతో ఉన్న పాతకక్షల నేపద్యంలోనే ఈ హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతుడు రవితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. సింగరాయకొండ సిఐ లక్ష్మణ్‌ ఆధ్వర్ంయలో పంచనామా పూర్తి చేశారు.. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మృతుని బంధువులు భోరున విలపిస్తున్నారు.. తాము కేవలం వైసీపీ పార్టీకి చెందిన వారం అన్న కక్షతో గతంలో ఉన్న గొడవల నేపథ్యంలో లారీ తో ఢీ కొట్టి తొక్కించి చంపారని మృతుని బంధువుల ఆరోపణ.. వైసిపిలోని తమ ప్రత్యర్ధులుగా ఉన్న నిందితులు కొంతమంది టిడిపి పార్టీకి చెందిన వారితో కలిసి రవితేజను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

సింగరాయకొండలో సంచలన సృష్టించిన రవితేజ హత్యకేసును ఎస్‌పి మలికగార్గ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. ఈ కేసులో ఒంగోలు డిఎస్‌పి బంధువు నిందితుడిగా ఉన్నాడన్న కారణంగా దర్శి డిఎస్‌పి నారాయణరెడ్డిని పర్యవేక్షణాధికారిగా నియమించారు.. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్‌పి ఈ హత్యకు పాత కక్షల నేపథ్యం ఉందని చెబుతున్నారు.. గతంలో గొడవల కారణంగా ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఫిర్యాదు చేశారని, తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకున్న ఈ కేసును అనంతరం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.. నిందితులను త్వరలో పట్టుకుంటామని, బాధితులు శాంతిభద్రతల సమస్యలు తెలెత్తకుండా సంయమనం పాటించాలని కోరుతున్నారు.

లారీతో బైక్‌ను ఢీకొట్టించి అనంతరం లారీతో తొక్కించి రవితేజను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుని బార్య, తల్లి, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ కేసును రాజకీయంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఒంగోలు డిఎస్‌పి నాగరాజుకు బందువుగా ఉన్న నేపధ్యంలో ఈ కేసు నుంచి కార్తీక్‌ ను తప్పించేందుకు రాత్రంతా ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గొడవలు ఉంటే కొట్టుకుంటారేకాని, హత్య చేసి కాపురాలను కూలుస్తారా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. పోలీసులు కూడా నిందితులకు వత్తాసు పలుకుతున్నారని, అందుకే సంఘటన జరిగిన 12 గంటల తరువాత కేసు నమోదు చేశారని, పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా తాత్సారం చేశారని ఆరోపిస్తున్నారు.. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే డిజిపి, సియం దగ్గరకు వెళ్ళి న్యాయం కోసం చేయాలని కోరుతామంటున్నారు.

Reporter: Fairoz, Tv9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu