Anakapalle: సర్‌ప్రైజ్ అంటే కళ్లు మూసుకున్నాడు.. ఖతం.. పుష్ప ఎంత పని చేసింది…?
మరో నెల రోజుల్లో పెళ్లి.. వధువు రమ్మని చెప్పింది.. నీకో సర్‌ప్రైజ్ అంటూ ఊరించింది.. కట్ చేస్తే అక్కడ జరిగిన సీన్ వేరు..
Andhra Pradesh: మే 20న పెళ్లి. వివాహానికి ముందు జరుగాల్సిన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటూనే ఉన్నారు. చూస్తే ఇద్దరు చక్కగా ఉన్నారు. ఈడు.. జోడు కలిసిన జంటలా మారి పోయారు. అలాంటి సమయంలో ఒక్కసారిగా షాక్. కాబోయే భార్య తో షికారు కెళ్ళి హత్యా యత్నానికి గురయ్యాడు. చేసింది ఎవరో కాదు.. స్వయానా పెళ్లి చేసుకోబోయే భార్య..! అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా మాడుగుల(Madugula) ఘాట్ రోడ్‌కు చెందిన అద్దేపల్లి రామునాయుడు హైదరాబాద్(Hyderabad)లో PhD చేస్తున్నాడు. అతనికి రావికమతంకు చెందిన వియ్యపు పుష్పతో వివాహం కుదిరింది. ఈ నెల మొదటి వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది. వచ్చే నెల 20న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
అయితే స్నేహితుడి వివాహం కోసమని రామ నాయుడు ఈ నెల 15న విశాఖ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అత్తామామలు.. ఇంటికి రావాలంటూ రామునాయుడిని ఆహ్వానించారు. అత్తారింట్లో కాబోయే భార్య తో కలిసి భోజనం చేశాడు. ఈ సమయంలోనే బయటకి వెళ్తామని.. తన స్నేహితులని పరిచయం చేస్తానంటూ పుష్ప కోరింది. రావికతమం నుంచి వడ్డాది జంక్షన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి బుచ్చయ్యపేట మండలం కొండెం పూడి ఆశ్రమం వైపు వెళ్లారు. అక్కడే ఈ దాడి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు షాక్ తిన్నారు. ఈ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది నిందితురాలు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ దాట వేసే ప్రయత్నం చేసిందంటున్నారు. పెద్దలు కుదిర్చిన బంధమే ఐనా ఇలా అయిందంటూ వాపోతున్నారు బాధితుడి సిస్టర్స్.
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రామునాయుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గొంతుకు 30 కుట్లు వేసిన వైద్యులు.. ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకొని బాధితుడి వాయిస్‌ను రికార్డు చేసుకున్నారు. ప్రాథమికంగా యువతిని కూడా ప్రశ్నించారు. కేవలం పెళ్లి ఇష్టం లేకనే పుష్ప అంత పని చేసిందా..? మరేదైనా ఉందా? ఇప్పటి వరకు ఎలాంటి గొడవ జరుగలేదంటున్న వీరు.. ఇంతలో ఇలా ఎందుకు జరిగింది? ఇంతకు గొంతు కోసిన కత్తి ఎక్కడ కొనుగోలు చేసింది? మధ్యలో ఆగిన షాపులోనే కత్తి కొనుగోలు చేసిందా? ముందే కొని బ్యాగ్‌లో పెట్టుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.