YS Jagan: టార్గెట్ 2024పై జగన్ ఫోకస్.. తుది దశకు వైసీపీలో పదవుల పందారం.. నేడు జాబితా ప్రకటించే ఛాన్స్!
టీమ్ 2024తో కేబినెట్‌లో సహచరులను మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించబోతున్నారు.
AP CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 2024 ఎన్నికలే టార్గెట్‌గా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతోంది వైసీపీ. టీమ్ 2024తో కేబినెట్(AP Cabinet)లో సహచరులను మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించబోతున్నారు. అలాగే, మంత్రి పదవులు ఆశించి అసంతృప్తిలో ఉన్న కొందరు నేతలకు నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవులకు సంబంధించి నేడు తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేస్తోంది వైసీపీ. గ్రౌండ్ లెవల్‌లో కార్యకర్తలను, సెకండ్ కేడర్‌ను నడిపించేందుకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించబోతోంది. తాజా మాజీ మంత్రుల్లో ఇద్దరికి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఇద్దరికి ఈ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడం, నేతల్ని, ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకోవడం, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించే వారికే పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు సీఎం జగన్. ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డికి ఈసారి పార్టీ కేంద్ర ఆఫీస్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సజ్జలతోపాటు విజయసాయిరెడ్డి కూడా సెంట్రల్ ఆఫీస్‌లో పార్టీ వ్యవహారాలను చూస్తారనే సమాచారం ఉంది. మంత్రులుగా ఉన్న బొత్స, పెద్దిరెడ్డికి, మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేనికి పార్టీ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.
రీజియన్ల వారీగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు బొత్స సత్యనారాయణను నియమిస్తారని సమాచారం. తూర్పుగోదావరికి వైవీ సుబ్బారెడ్డిని, పశ్చిమ గోదావరికి ఎంపీ మిధున్‌రెడ్డిని పార్టీ బాధ్యులుగా పెడతారని తెలుస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల బాధ్యతలను కొడాలి నానికి అప్పగిస్తారనే సమాచారం ఉంది. పల్నాడు జిల్లాకు మోపిదేవి వెంకట రమణను, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కడప, కర్నూలుకు కలిపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ బాధ్యులుగా పెడతారని సమాచారం.
వీటితో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు, కడప జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించనుండగా.. సజ్జలకు ప్రత్యేకంగా జిల్లా బాధ్యతలు కేటాయించకుండా పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కీలకమైన విశాఖ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి ఫైనల్ లిస్ట్ బయటకి వస్తే కానీ ఈ నియామకాలపై స్పష్టత రాదు.
Read Also…. Governor Delhi Tour: ప్రజాసేవలో ఉంటాను.. ప్రొటోకాల్‌ను పట్టించుకోను.. కేంద్రం చూసుకుంటుందిః తమిళిసై