Vijayawada Flood: ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?

చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజీలే అనుకుంటే.. కాలువలో కాలేసినట్లే! అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును.. ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తింది. బెజవాడకు ఏంటీ బుడమేరు శాపం? శనివారం సాయంత్రం అసలేం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప ముంచిందా?

Vijayawada Flood: ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం..  అలసత్వమే కొంప ముంచిందా?
Vijayawada Flood
Follow us

|

Updated on: Sep 04, 2024 | 9:18 AM

చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజీలే అనుకుంటే.. కాలువలో కాలేసినట్లే! అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును.. ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తింది. బెజవాడకు ఏంటీ బుడమేరు శాపం? శనివారం సాయంత్రం అసలేం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప ముంచిందా?

ఆదివారం ఉదయం విరుచుకుపడ్డ బుడమేరు

విజయవాడకు చేరక ముందే బుడమేరు ప్రతాపం మొదలైంది. దారిలో కనిపించిన ఊరునల్లా ముంచుకుంటూ వచ్చిన బుడమేరు.. ఆదివారం(సెప్టెంబర్ 1) ఉదయం ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పంలా విరుచుకుపడింది. ఆనకట్ట తెగిన అనకొండలా.. సింగ్‌ నగర్‌ ప్రాంతాన్ని మింగేసింది. బుడమేరకు పడ్డ గండ్లు, దాని ధాటికి తెగిపోయిన చెరువులు.. విజయవాడతో పాటు నాలుగైదు పల్లెటూళ్లను కూడా నామరూపాలు లేకుండా చేసింది. విజయవాడలో ఆరున్నర లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేసింది. ఊరును ముంచేసింది. అంటే బెజవాడలో మూడో వంతుమంది బుడమేరు బారిన పడ్డారన్న మాట.

వెలగలేరు రెగ్యులేటర్‌ ద్వారా నియంత్రణ

విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్‌ ద్వారానే బుడమేరు వరదను కంట్రోల్‌ చేస్తారు. విజయవాడలో చూడడానికి చిన్న కాలువలా ఉండే బుడమేరు.. ఇదిగో ఈ వెలగలేరు నుంచే బయల్దేరి.. మహోగ్ర వరద రూపంలో విజయవాడలో జల విలయం సృష్టించింది.

ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణలోకి..

మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు కొండల్లో పుట్టే బుడమేరు…వెలగలేరు రెగ్యులేటర్‌ దగ్గర రెండుగా చీలుతుంది. ఒక ప్రవాహం ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి మీదుగా కృష్ణా నదిలోకి వెళుతుంది. మరో పాయ.. విజయవాడ నగరం మీదుగా వెళ్లి.. కొల్లేరుకు చేరుకుంటుంది. విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణా నదికి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణా నదిలో వరద, పోటు ఎక్కువగా ఉంటే.. వరదను విజయవాడలోకి వదులుతారు.

వేరే దారి లేక విజయవాడకు మళ్లించిన అధికారులు

శనివారం(ఆగస్ట్ 31) సాయంత్రం నాలుగు గంటలకు బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద పోటెత్తింది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్‌ నుంచి బుడమేరు వరదను విడుదల చేశారు. అటు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరగడం, ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువవడంతో.. బుడమేరు వరదను విజయవాడ వైపునకు వదిలేశారు. వెలగలేరు రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణలోకి వరదను వదిలినా.. అది నదిలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం, వెనక్కి తన్నే అవకాశం ఉండడంతో.. విజయవాడ లోకి నీటిని వదిలేశారు.

ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు

బుడమేరుకు వచ్చిన భారీ వరదను విజయవాడలోకి వదిలేసిన అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహించారు. ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆదివారం ఉదయం.. జనం నిద్ర లేచే సమయానికి విజయవాడ మీద బుడమేరు విరుచుకుపడింది. డజన్ల కొద్దీ కాలనీలు నీట మునిగిపోయాయి. 10 అడుగుల పైన వరద రావడంతో జనం కకావికలమైపోయారు. ఇక బుడమేరు విజయవాడకు వెళ్లే దారి పొడవునా విధ్వంసం సృష్టించింది. అనేక చెరువులకు, కాలువలకు కొన్ని వందల చోట్ల గండ్లు పడేలా చేసింది.

బుడమేరుకు ఈ స్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యం, విజయవాడ పరిసరాల్లో ఆక్రమణలు.. ఇలా అన్నీ కలిసి బెజవాడను ముంచెత్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..