T20 World Cup 2026 : వంద కాదు కదా, 50 కూడా చేయలేకపోయారు..టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత దారుణమైన స్కోర్లు ఇవే
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ అంటేనే పరుగుల వరద, సిక్సర్ల వర్షం అని అందరూ అనుకుంటారు. కానీ, క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు బ్యాటర్లు ఘోరంగా విఫలమై, జట్టు స్కోరును కనీసం రెండంకెలు దాటించడానికి కూడా నానా తంటాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి.

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ అంటేనే పరుగుల వరద, సిక్సర్ల వర్షం అని అందరూ అనుకుంటారు. కానీ, క్రికెట్ చరిత్రలో కొన్నిసార్లు బ్యాటర్లు ఘోరంగా విఫలమై, జట్టు స్కోరును కనీసం రెండంకెలు దాటించడానికి కూడా నానా తంటాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అతి తక్కువ స్కోర్లకే కుప్పకూలి, ప్రపంచం ముందు తలదించుకున్న జట్లు కూడా ఈ టోర్నీలో ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ సందడి మొదలైన వేళ, పాత రికార్డులను ఓసారి తిరగేస్తే కొన్ని షాకింగ్ గణాంకాలు బయటపడ్డాయి.
చరిత్రలో అత్యల్ప స్కోర్లు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత అవమానకరమైన స్కోర్ చేసిన జట్టుగా యుగాండా నిలిచింది. 2024 జూన్ 8న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యుగాండా కేవలం 39 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు బ్యాటర్లు వెస్టిండీస్ బౌలర్ల ధాటికి కనీసం 12 ఓవర్లు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. విచిత్రం ఏంటంటే, అదే రోజున నెదర్లాండ్స్ కూడా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా 39 పరుగులకే ఆలౌట్ అయ్యి, సంయుక్తంగా ఈ చెత్త రికార్డును పంచుకుంది. గతంలో 2014లో కూడా నెదర్లాండ్స్ ఇలాగే శ్రీలంక బౌలింగ్‌కు వణికిపోయి 39 పరుగులకే డగౌట్ చేరింది.
మళ్ళీ మళ్ళీ యుగాండా.. వదలని నెదర్లాండ్స్
ఈ లిస్టులో యుగాండా పేరు మరోసారి కనిపిస్తుంది. 2024 జూన్ 14న న్యూజిలాండ్ బౌలర్ల స్వింగ్‌కు యుగాండా బ్యాటర్లు సమాధానం చెప్పలేక కేవలం 40 పరుగులకే కుప్పకూలారు. పెద్ద టోర్నీలలో అనుభవం లేకపోవడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఇక నెదర్లాండ్స్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ల ధాటికి ఈ జట్టు 44 పరుగులకే మట్టికరిచింది. శ్రీలంక బౌలర్లంటే ఈ చిన్న జట్లకు వెన్నులో వణుకు పుడుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఒమన్ కూడా తక్కువ ఏమీ కాదు
2024 ప్రపంచకప్‌లో ఒమన్ జట్టు కూడా తన పేరును ఈ బ్లాక్ లిస్టులో చేర్చుకుంది. జూన్ 13న ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో ఒమన్ కేవలం 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లీష్ పేసర్ల బౌన్సర్లకు ఒమన్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. భారీ అంచనాలతో వరల్డ్ కప్ లాంటి మెగా వేదికపై అడుగుపెట్టిన ఈ జట్లు, ఇలాంటి స్కోర్లతో తమ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ ఐదు స్కోర్లు ఇప్పటికీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శనలుగా నిలిచిపోయాయి.
2026 ప్రపంచకప్‌లో పరిస్థితి మారుతుందా?
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమైన 2026 టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికగా జరుగుతోంది. మార్చి 8న ఫైనల్ జరగనుంది. ఈసారి యూఎస్ఏ వంటి జట్లు భారత్ వంటి దిగ్గజ జట్లకు గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పాత రికార్డులను చెరిపివేసి, చిన్న జట్లు కూడా పోరాట పటిమను ప్రదర్శిస్తాయని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఉపఖండం పిచ్‌లపై స్పిన్నర్లు రాజ్యమేలుతుండటంతో, బ్యాటర్లు అప్రమత్తంగా లేకపోతే ఈసారి కూడా 50 లోపు స్కోర్లు నమోదయ్యే ప్రమాదం లేకపోలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
