Andhra Pradesh: జగనన్న కాలనీలపై సీఎం స్పెషల్ ఫోకస్.. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని..
Andhra Pradesh: గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా కంప్లీట్ చేయాలని..
Andhra Pradesh: గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పథకాలు, ఇళ్ల నిర్మాణాల అమలులో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని, వసతుల కల్పనలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4,318 కోట్లతో గృహ నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు ఆయనకు వివరించారు. మొదటి దశలో మొత్తం 15.6 లక్షలు, రెండో దశలో 5.56 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పనులు నెమ్మదించాలయని, వర్షాలు తగ్గిన తరువాత పనులు వేగవంతం చేయనున్నట్లు అధికారులు వివరించారు. హౌసింగ్ స్కీమ్ ఆప్షన్ 3 కింద పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబర్‌లోగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని టిడ్కో నివాసాల అధికారులు సీఎంకు తెలిపారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇక ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. 90 రోజుల్లో ఇంటి-స్థలం లీజు మంజూరుపై ఇప్పటి వరకు 96,800 మంది లబ్ధిదారులకు లీజులు ఇచ్చామని, మరో 1.07 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలుపుతున్నామన్నారు.
కాగా, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటికి రూ 5 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం రూ. లక్షా 30 వేల కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద అర్హులుగా గుర్తించారు.
ఇక నాడు-నేడు సమీక్షలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ గురుకులం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను డెవలప్ చేయడమే కాకుండా.. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు హాస్టళ్లలో మెనూను రోజూ మార్చాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..