ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి 50 కి.మీ. దూరంలో ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పని చేస్తోంది.

సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉన్న 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పే ప్రణాళికలను ప్రారంభించింది. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సీఎం సచివాలయంలో చేసిన సమీక్ష లో పలు కీలక అంశాలను చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టీకే.రామచంద్రన్ తో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశం లో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణం అవుతున్న పోర్టుల స్థితిగతుల పై చర్చించారు.
ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్
తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ ఒక పోర్ట్ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని సిఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్ట్, ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించింది. కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిథిలోకి వచ్చిన దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. ఇనిషియల్ ఫీజిబులిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌తో కలిపి అభివృద్ది చేస్తారు. 4 డ్రై డాక్‌లు, అవుట్ ఫిటింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాలు భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్రం దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. భూసేకరణతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతారు.
స్పెషల్ పర్పస్ వెహికల్
ఇందుకోసం స్పెషల్ పర్మస్ వెహికిల్ (SPV) ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అవసరమైన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని సిఎం కేంద్ర అధికారులను కోరారు. అదే విధంగా రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సమావేశంలో అధికారులు వివరించారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్ ను అభివృద్ది చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సిఎం సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి