Krishna District: కరివేపాకు కోసుకెళ్లి ఇంట్లో ఇవ్వలేదని.. వాచ్‌మెన్‌ను చెప్పలేని రీతిలో..
కృష్ణా జిల్లా పెదఓగిరాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉద్యోగుల మధ్య జరిగిన చిన్న వివాదం పెద్ద దుమారంగా మారింది. లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, వాచ్‌మన్ నాగరాజుపై తీవ్రంగా దుర్భాషలాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అయింది. అతను వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో.. ఉన్నతాధికారులు వివరణ అడిగినట్లు సమాచారం.

కృష్ణా జిల్లా పెదఓగిరాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ.. వాచ్‌మెన్ నాగరాజుపై బూతులతో విరుచుకుపడ్డాడు. అందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గత శుక్రవారం సత్యనారాయణ, సబ్‌స్టేషన్‌లో ఉన్న చెట్టు నుంచి కరివేపాకు కోసి తన ఇంటికి తీసుకెళ్లమని నాగరాజును ఆదేశించాడు. అయితే.. డ్యూటీ పని మీద ఉండటం చేత నాగరాజు ఆ పని చేయలేదు. ఈ విషయంపై సత్యనారాయణ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి.. నాగరాజుకు ఫోన్ చేసి.. రాయలేని దుర్భాషలు వాడుతూ తిట్ల దండకం అందుకున్నాడు.
తాను ఎందుకు ఇవ్వలేకపోయానో నాగరాజు వివరిస్తున్నా సత్యనారాయణ ఓపిక పట్టలేదు. నోటికి వచ్చినట్లుగా అనుచిత పదజాలంతో దూషించాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగరాజు, సత్యనారాయణ తిట్లను రికార్డు చేసి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు పంపించాడు. అంతటితో ఆగకుండా, ఆ ఆడియోను గ్రామస్థులు, అధికారుల వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశాడు.
ఈ ఆడియో బయటకు రావడంతో గ్రామస్థులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సొంత పని చేయలేదని ఇంత భూతులు మాట్లాడుతారా?’ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం అధికారుల దృష్టిలో ఉండగా, సత్యనారాయణ నుంచి వివరణ కోరినట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
