Anantapur Politics: టీడీపీలో మారుతున్న సమీకరణాలు.. పార్థసారధి ప్రయత్నాలతో అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ ఫైట్ నడుస్తోంది. అనంతపురం అర్బన్ టికెట్ కోసం సీనియర్ నేతలు నువ్వానేనా అంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతకు విజ్ఞప్తులు పంపుతున్నారు. మొదటి జాబితా విడుదలైన తర్వాత మరింత ఒత్తిడి పెరుగుతోంది.

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ ఫైట్ నడుస్తోంది. అనంతపురం అర్బన్ టికెట్ కోసం సీనియర్ నేతలు నువ్వానేనా అంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేతకు విజ్ఞప్తులు పంపుతున్నారు. మొదటి జాబితా విడుదలైన తర్వాత మరింత ఒత్తిడి పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో సీటు రాని నేతలు.. ఫస్ట్ లిస్ట్‌లో పేరు లేని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరూ వైసీపీకి జంప్ చేస్తే.. మరికొందరూ మాత్రం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బన్ టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. అనంతపురం అర్బన్ సీటుపై కన్నేశారు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి. పెనుకొండ టికెట్ సవితకు ఇప్పటికే టీడీపీ అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్థసారధి.
పెనుగొండ టికెట్ లేదు. కనీసం అనంతపురం అర్బన్ టికెట్ అయినా ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టారు. పార్థసారధి ప్రయత్నాలతో అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. టికెట్ రేసులోకి తన కుమారుడు మధుకర్ చౌదరిని తీసుకొచ్చారు. టికెట్ తనకు కాకపోతే మధుకర్‌కు ఇవ్వాలంటూ అధిష్టానం ముందు ప్రపోజల్ పెడుతున్నారు ప్రభాకర్ చౌదరి. ఇంకేముంది మధుకర్‌ని అర్బన్ వీధుల్లో ప్రచారంలోకి దించేశారు. అదే స్పీడుతో మధుకర్ చౌదరి సైతం టీడీపీ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్తున్నారు.
ఇప్పటికే అనంతపురం అర్బన్ టికెట్ జనసేన తరపున పవన్ కల్యాణ్ పోటీ చేస్తే తప్పా.. ఇంకెవరూ పోటీ చేసిన సహకరించేది లేదంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు ప్రభాకర్ చౌదరి. వచ్చే ఎన్నికల్లో తాను కానీ.. తన కుమారుడు కాని పోటీ చేస్తారని చెప్తున్నారు. అలాగే అనంతపురం అర్బన్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో అనంతపురం అర్బన్ టికెట్ అటు బీకే పార్థసారధికి.. ఇటు ప్రభాకర్ చౌదరికి ప్రిస్టేజియస్‌గా మారింది. ఎవరి వైపు అధిష్టానం మొగ్గినా.. మరోనేత అలకబూనడం పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటికే రెండో లిస్ట్‌పై కూడా కసరత్తు చేసిన చంద్రబాబు.. వీలైనంత త్వరలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. రెండో లిస్ట్‌లో పార్థసారధికేనా? లేక ప్రభాకర్ చౌదరికా అనేది తేలనుంది..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




