Andhra Pradesh: రసవత్తరంగా సింహపురి రాజకీయాలు.. టీడీపీలోకి ఆనం, మేకపాటి.. రూట్ క్లియర్..
Simhapuri Politics: సింహపురి రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలో చేరేందుకు కీలక నేతలు సమాయత్తమవుతున్నారు. ఒకరు చంద్రబాబును కలిస్తే.. మరొకరు లోకేష్ తో భేటీ అయ్యారు.

Simhapuri Politics: సింహపురి రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలో చేరేందుకు కీలక నేతలు సమాయత్తమవుతున్నారు. ఒకరు చంద్రబాబును కలిస్తే.. మరొకరు లోకేష్ తో భేటీ అయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇద్దరూ కూడా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించడంతో సింహపురి రాజకీయం రసవత్తరంగా మారింది. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర పూర్తైన తర్వాత తాను టీడీపీలోకి చేరనున్నట్టు సీనియర్ నేత, YCP నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే విషయం చెప్పానని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాద్ర దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని విధాలా తాము ప్రయత్నిస్తామని ఆనం తెలిపారు. ఈ ఉదయం నెల్లూరులోని ఆయన నివాసంలో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, బీదా రవిచంద్ర కలిశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 33 రోజులు పాటు లోకేష్ పాదయాత్ర జరగనుంది. జిల్లాలో పాదయాత్ర రూట్‌మ్యాప్ ఖరారు చేసేందుకు ముఖ్య నాయకులందరూ ఆనంను కలిశారు.
లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి..
YCP నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరెడ్డి టీడీపీలో చేరనున్నారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరు గ్రామంలో ఉన్న లోకేష్‌తో చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు మేకపాటి సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 13న లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆ యాత్రలో మేకపాటి పాల్గొంటారని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.
రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా జరిగిందని, అంతకు మించిన రీతిలో నెల్లూరు జిల్లాలో జరుగుతుందని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా తమ వెంట రావడంతో సంతోషంగా ఉందని అమర్‌నాథ్ రెడ్డి అన్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
