AP Projects: డబుల్ ఇంజిన్ సర్కారులో డబ్బుల వరద.. ఇక ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే..!
విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కీలక ప్రాజెక్టు ఒకటీ లేదు. అసలు రాజధాని లేకపోతే మిగతా రాష్ట్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విశాఖ నగరం అంతంత మాత్రం తప్పితే మిగతా ఎక్కడా సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంతెందుకు రాజధాని అమరావతి లోనే ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించాలంటే సరైన కన్వెన్షన్ హాల్ లేకుండా పోయింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమరోత్సహంతో ముందుకు వెళ్తోంది. కేంద్రం సరైన సమయంలో సహకారం అందిస్తూ ఉండడం తో కీలక ప్రాజెక్టు లు పట్టాలెక్కుతున్నాయి. అమరావతి కి 15 వేల కోట్లు, పోలవరం కు 12 వేల కోట్లు, కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మౌలిక సదుపాయాల కల్పన కు 2400 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 5000 కోట్లు, 15 వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు, విశాఖ, విజయవాడ లలో మెట్రో లకు 40 వేల కోట్ల కు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ప్రోత్సాహం… లాంటి ప్రాజెక్టులతో నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ కు దిగుతోంది. సరిగ్గా నేటినుంచి నాలుగేళ్లు టార్గెట్ గా పెట్టుకుని దశలవారీగా పనులు పూర్తి చేయాలన్న తలంపుతో ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సరికొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కారు.
విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కీలక ప్రాజెక్టు ఒకటీ లేదు. అసలు రాజధాని లేకపోతే మిగతా రాష్ట్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విశాఖ నగరం అంతంత మాత్రం తప్పితే మిగతా ఎక్కడా సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంతెందుకు రాజధాని అమరావతి లోనే ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించాలంటే సరైన కన్వెన్షన్ హాల్ లేకుండా పోయింది. దాంతో ఇరుకు ఇరుకుగా సచివాలయంలోని ఐదో బ్లాక్ లోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా బాలారిష్టాలన్ని దాటడానికి నానా తంటాలు పడుతున్న రాష్ట్రానికి కేంద్రం తాజాగా ఇస్తున్న సహకారం కొంత ఉత్సాహాన్నిస్తోంది.
ఏపీపై దృష్టిసారించిన కేంద్రం..
డబల్ ఇంజన్ సర్కార్ కావడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కీలకమైన భాగస్వామి కావడంతో విభజన జరిగిన పదేళ్ల తర్వాత బుడిబుడి అడుగులు వడివడిగా పడుతున్న సందర్భం ప్రస్తుతం కనిపిస్తోంది. మొదటి రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అప్పటి ఎన్డీయేలో ఉన్నప్పటికీ కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఎంపీల సంఖ్యతో పెద్ద అవసరం లేకుండా పోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో చాలా ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ ఆర్థిక సహకారం కొరవడడంతో ప్రాజెక్టులన్ని టేక్ ఆఫ్ కాలేకపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యాలు మారడంతో రాష్ట్రంలో పరిస్థితులు వేరొక షేప్ తీసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీలు అప్పట్లో ఉన్నప్పటికీ… కేంద్రంలో బిజెపికి పూర్తి బలం ఉండడంతో ఐదేళ్లు కేంద్రం రాష్ట్రం వైపు పెద్దగా చూడలేదు. ఏదో తాత్కాలిక అవసరాలకి సహకారం తప్ప.. నవ్యాంద్ర నిర్మాణానికి నిర్మాణాత్మక సహకారం దక్కలేదు. అయితే ఈ పదేళ్ల ఆవేదనను, ఆందోళనను పూడుస్తూ తాజాగా ఇటు రాష్ట్రంలో… అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే రావడమే కాకుండా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కీలక భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది.
అమరావతి అభివృద్ధికి నిధులు..
మొదట కేంద్ర బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో రాష్ట్రానికి నిధుల వరద ప్రారంభం అయింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని పార్లమెంట్ వేదికగానే చెప్పారు. ఇది కేంద్రం పూచికత్తుగా ఉండి వరల్డ్ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్న రుణమైనప్పటికీ దానిని అత్యవసరంగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన వెంటనే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రూ.15 వేల కోట్లను తక్షణమే రాష్ట్రానికి తెచ్చుకునేందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టారు. దాంతో వరల్డ్ బ్యాంకు తోపాటు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సూత్రప్రాయంగా నిధులు విడుదలకి ఆమోదం తెలిపిపోయారు. కేవలం ఈ రూ.15,000 కోట్లు మాత్రమే కాకుండా అవసరమైనంత సహకారాన్ని అందించేందుకు కేంద్ర మద్దతుతో వరల్డ్ బ్యాంకు కూడా సిద్ధంగా ఉండడం ఆశావహ పరిణామంగా చూడొచ్చు.
పోలవరం కోసం నిధుల వరద..
ఇక రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశాలలో రెండోది పోలవరం. ఇప్పటి వరకు మొదటి దశ అంచనాల ప్రకారం రూ.25వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అంచనాలలో ఇంకా రాష్ట్రానికి రూ.12 వేల కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని హోం మంత్రి అమిత్ షా, జల వనరుల శాఖ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పరిస్థితులని వివరించి వాళ్ళని కన్విన్స్ చేయడంలో సఫలీకృతమయ్యారు. దీంతో బుధవారం(ఆగస్టు 28) జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని చేర్చి రావాల్సి ఉన్న రూ. 12 వేల కోట్లను చెల్లించేందుకు కేంద్రం షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరొక రూ.6,157 కోట్లు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేవలం ఇదే కాకుండా తర్వాత దశలలో పెరిగిన అంచనాలు, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ ఆక్విజిషన్ లాంటి వాటికి కూడా అవసరమైన మరొక రూ.30 వేల కోట్లను కూడా తెచ్చుకోగలమన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబు అత్యంత కీలకమైన నేత కాబట్టి అందులోనూ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన హామీల్లో ఇచ్చిన హామీ కాబట్టి కచ్చితంగా 2029 లోపు ఆ నిధులను పొంది పూర్తిస్థాయిలో ప్రాజెక్టుని పూర్తి చేయగలమన్న ప్రగాఢ విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఆ మేరకు అవసరమైన కార్యాచరణని రూపొందించి అమలు చేయడానికి సిద్ధం చేస్తుంది. ప్రధానంగా అత్యావశ్యకంగా నిర్మించాల్సిన డయా ఫ్రమ్ వాల్ ను కూడా రూ.990 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం, మిగతా అవసరమైన మార్పులకి చేర్పులకి తోడ్పాటు ఇస్తుండడంతో వచ్చే రెండు సీజన్లలోపు డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. ఈలోపే విశాఖకి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఎడమ కాల ద్వారా నీటిని అందించేందుకు అవసరమైతే లిఫ్టింగ్ కూడా చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు కూడా టేక్ ఆఫ్ కావడం, 2027 మార్చిలోకి మొదటి దశని పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ తిరిగి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమవుతున్నాయి.
మెట్రో ప్రాజెక్టుల కోసం..
ఇక విభజన హామీల్లో మరొక కీలకమైన హామీ విశాఖ, విజయవాడలో మెట్రో రైల్.. ఇందుకోసం ప్రత్యేక మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ప్రారంభించిన గత టిడిపి ప్రభుత్వం అప్పట్లో చేసిన ప్రయత్నానికి కేంద్రం పెద్దగా సహకారం లభించలేదు. కానీ ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబుకు ఉన్న పరపతి నేపథ్యంలో విశాఖ విజయవాడలో మెట్రోని పట్టాలెక్కించేందుకు అంచనాలు పంపించాలని కేంద్రమే కోరడంతో అందుకు అనుగుణంగా అంచనాలు సిద్ధమవుతున్నాయి. అమరావతిలో 26 వేల కోట్లు, విశాఖలో మరో 17వేల కోట్లు దాదాపు రూ.40 వేల కోట్ల రూపాయలతో రెండు చోట్ల రెండు దశలలో మెట్రో రైల్ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు వారం పది రోజుల్లో అంచనాలను పూర్తి చేసి కేంద్రానికి పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష వివరాలను మంత్రి నారాయణ స్పష్టంగా వివరించారు. సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ లపై చర్చ జరిగింది. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విజయవాడ,విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ లు చట్టంలో పేర్కొన్నారన్నారు. దానికి తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేలా డీపీఆర్ సిద్దం చేసారు.మొదటి దశలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకూ 25.95 కిమీ,అలాగే బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ 12.45 కిమీ నిర్మాణం చేపట్టనున్నారు..మొత్తం మొదటి దశలో 38.40 కిమీ మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 11 వేల 9 కోట్లు ఖర్చవుతుంది..ఇక రెండో విడతలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిమీ మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్ రూపకల్పన చేసారు. దీనికి 14 వేల 121 కోట్లు ఖర్చవుతుందని అంచనా..అంటే విజయవాడ మెట్రోకు మొత్తం రెండు దశలకు కలిపి 66.20 కిమీ మేర నిర్మించే ప్రాజెక్ట్ కు 25 వేల 130 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పారు.
ఇక విశాఖపట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో రెండు దశల్లో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దం అయింది..మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకూ 34.40 కిమీల మేర మొదటి కారిడార్,గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ మొత్తం 5.07 కిమీ మేర రెండో కారిడార్,తాడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు..అంటే మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు..ఇక రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు..అంటే విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 11 వేల 4987 కోట్లు,రెండో దశలో 5,734 కోట్లు కలిపి మొత్తం 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
ఈ రెండు ప్రాజెక్ట్ ల ఫేజ్ వన్ కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద నాలుగు రకాల ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాలని పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే పదేళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్ట్ లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రపంచం మొత్తం మెట్రో రైలు పైఆధారపడిందని…పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో మూడు కారిడార్లు..
ఇక ఇక కొత్తగా కేంద్రం ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్ లో రాష్ట్రం మీదగా మూడు కారిడార్లు వెళ్లబోతున్నాయి. విశాఖపట్నం-చెన్నై హైదరాబాద్- చెన్నై హైదరాబాద్ -బెంగళూరు కారిడార్లు వల్ల రాష్ట్రానికి విపరీతమైన ప్రయోజనం కలగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ తో పాటు కడప జిల్లా కొప్పర్తిలో దాదాపు 5వేల కోట్ల రూపాయల నిధులతో ఏర్పడబోతోన్న ఈ క్లస్టర్ల ద్వారా లక్ష ఇరవై వేల మందికి పైగా ఉపాధి లభించబోతోంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కూడా వెంటనే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
అదే సమయంలో కేంద్రం కొత్తగా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్రోరేటా బేస్ లో అదనంగా నిధులు ఇస్తుంది. అందులో మన రాష్ట్రానికి దాదాపు 2400 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. ఇప్పటికే 1500 కోట్లు వచ్చేసాయి కూడా. మరొకవైపు 15వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు రావడంతో వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇలా కేంద్రంతో ప్రస్తుతం ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో అవకాశం ఉన్నంత వరకు నిధులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకి కేంద్రం కూడా అదే విధంగా సహకరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూనే, పూర్తి స్థాయిలో కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశిస్తుండడం, స్వయంగా సమీక్షిస్తుండడం, నేరుగా కార్యాచరణకు దిగుతుండడంతో అన్ని శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళుతున్న పరిస్థితి రాష్ట్ర సచివాలయంలో కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టులన్ని క్షేత్రస్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో వీటి ఫలితాలు రాబోతున్నాయి. వీటితో పాటు ఈ ఐదేళ్లు కేంద్రం నుంచి వీలైన నిధులు తెప్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది సో జరుగుతున్న పరిణామాలన్నీ శుభ పరిణామాలనీ భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ధీమాను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి