భారత కుబేరులకు కేరాఫ్‌గా మారుతోన్న UAE.. ఇండియా నుంచి వలసలు ఎందుకు పెరిగాయి..?
ఇప్పుడు ఇదో ట్రెండ్.. మన దేశంలోని అపర కుబేరులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు వలసపోతున్నారు. ఆ దేశంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి భారత్‌కు చెందిన సంపన్నులను UAE ఆకర్షిస్తోంది.
శతాబ్ధాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలు వెతుక్కొంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు భారతీయులు వలసలు వెళ్లే దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. తాజా నివేదిక మేరకు భారతీయులు మెరుగైన అవకాశాల కోసం ఇప్పుడు మరో దేశం వైపు చూస్తున్నారు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). మరీ ముఖ్యంగా భారత్‌కు చెందిన అపర కుబేరులు ఆ దేశానికి మకాం మారుస్తున్నారు. అవకాశాల స్వర్గమైన ఆ దేశంలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్లు దుబాయ్ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం అవుతూనే.. తమ సంపద గ్రాఫ్‌ను భారీగా పెంచుకుంటున్నారు. పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి కారణంగా భారత సంపన్నులు యూఏఈ వైపు ఆకర్షితులవుతున్నారు. మరికొందరు భారత్‌లో ఉంటూనే అక్కడ భారీ పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు.
యూఏఈ జనాభాలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు. జీఎంఐ గణాంకాల మేరకు యూఏఈ మొత్తం జనాభా 1.24 కోట్లు కాగా.. ఇందులో 39.10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈ మొత్తం జనాభాలో ఏకంగా 38.2 శాతం మంది భారతీయులే ఉన్నారు. అమెరికా, సౌదీ అరేబియా, నేపాల్ తర్వాత అత్యధిక భారతీయ జనాభా కలిగిన నాలుగో దేశం యూఏఈ. భారత్ -యూఏఈల మధ్య వాణిజ్య సంబంధాలు శతాబ్ధాల కాలంగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం రంగంలో మెరుగైన అవకాశాలతో గత రెండు దశాబ్ధాల కాలంలో ఆ దేశంలోకి భారతీయుల వలసలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఆ దేశంలో నిర్మాణం, మౌలిక వసతులు, రీలైల్, ఫైనాన్స్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు భారత్ నుంచి ఆ దేశానికి వలస వెళ్తున్న వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఓ రకంగా మన వాళ్లు యూఏఈలో పెట్టుబడులతో కోట్లకు పడగలెత్తుతూనే.. మరోవైపు ఆ దేశాన్ని మరింత సుభిక్షం చేయడంలో మేము సైతం అంటున్నారు. ఇంతకీ భారత అపర కుబేరులు యూఏఈ వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా..
1. ఆకర్షణీయమైన పెట్టుబడి, ప్రాపర్టీ మార్కెట్..
ప్రాపర్టీ మార్కెట్‌తో పాటు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కారణంగా యూఏఈ.. మరీ ముఖ్యంగా ఆ దేశంలో అత్యధిక జనాభా కలిగిన దుబాయ్ నగరం భారతదేశంలోని సంపన్నులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. హెన్లీ & పార్ట్‌నర్స్ నివేదిక ప్రకారం 2023లో సుమారు 4,300 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచి UAEకి వలసవెళ్లారు. 2022లో భారతీయ కొనుగోలుదారులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించారు. అక్కడ ఆ ఏడాది జరిగిన మొత్తం గృహ కొనుగోళ్లలో 40% మంది భారతీయ సంపన్నులు ఉండటం విశేషం. వీరిలో అత్యధికులు ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్‌కు చెందిన కుబేరులు ఉన్నారు. ఆ ఏడాది వీరు ఏకంగా 16 బిలియన్ దిర్హామ్‌లు (Rs. 35,500 కోట్లు) కోటి) విలువ చేసే ప్రాపర్టీ కొనుగోలు చేశారు. 2021తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావడం విశేషం. భారత కుబేరులను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా కంటే యూఏఈ ముందుందని తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే సంపన్న భారతీయులు UAE వైపు చూడటానికి ఇది ప్రధాన కారణంగా ఉంది.
2. అనుకూలమైన పన్ను వాతావరణం
భారతదేశంలోని అతి సంపన్నులు UAEకి వలస వెళ్ళడానికి ప్రధానమైన కారణాల్లో అనుకూలమైన పన్ను వాతావరణం కూడా ఒకటి. UAEలో వ్యక్తిగత ఆదాయపు పన్ను బారం ఉండదు. అలాగే పన్ను రహిత జీవనశైలిని అందిస్తుండటంతో భారత సంపన్నులు యూఏఈ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. భారత్‌లో పన్నుల భారంతో తమ సంపదను కోల్పోతున్నామని భావించే సంపన్నులు.. తమ సంపదను రక్షించుకోవడానికి యూఏఈకి వలసవెళ్లడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు. దీనికి తోడు UAEలోని వాణిజ్య స్నేహపూర్వక విధానాలను భారత సంపన్నులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు పెట్టాలంటే మెజారిటీ పెట్టుబడులతో స్థానిక భాగస్వామిని కలిగి ఉండాలనే నిబంధనను తొలగించడం భారత్ సహా విదేశీ పెట్టుబడిదారులను మరింతగా ఊరిస్తోంది. ఈ వెసులుబాటు భారత సంపన్నులకు పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తోంది.
3. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్
UAE అమలు చేస్తోన్న గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ సంపన్న భారతీయులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2022లో గోల్డన్ వీసా ప్రోగ్రామ్‌ని విస్తరించడంతో ఇప్పుడు ఎక్కువ మంది వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక రెసిడెన్సీని అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ వారికి, వారి కుటుంబాలకు స్థిరత్వం, భద్రతను అందించడమే కాకుండా UAEలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, పెట్టుబడి అవకాశాలను సులభతరం చేస్తుంది. ఇది భారతదేశంలోని ఉన్నత వర్గాలను యూఏఈ వైపు ఆకర్షితులు చేస్తోంది.
4. మెరుగైన జీవన ప్రమాణాలు
UAEలోని కాస్మోపాలిటన్ సంస్కృతి, అధిక నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు, అద్భుతమైన పౌర సౌకర్యాలు, విభిన్నమైన వినోద అంశాలు భారతదేశంలోని సంపన్నులు అటుపైపు ఆకర్షితులయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. అలాగే ఆ దేశంలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, నాణ్యమైన అత్యున్నత స్థాయి విద్య, లగ్జరీ షాపింగ్, ఉన్నత జీవన ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే మెరుగైన జీవన ప్రమాణాలను కోరుకునే సంపన్నులు యూఏఈ వైపు చూస్తున్నారు. సంపన్న భారతీయులు మరింత మెరుగైన జీవనశైలి కోసం UAE సరైన ఎంపికగా భావిస్తున్నారు.
5. అభివృద్ధి చెందుతున్న టెక్, స్టార్టప్ ఎకోసిస్టమ్
టెక్, స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు యూఏఈ హాట్‌స్పాట్‌గా మారింది. వీరి కోసం యూఏఈ అనుకూలమైన విధానాలను అమలు చేయడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. మరీ ముఖ్యంగా దుబాయ్.. భారతీయ టెక్ టాలెంట్‌కి అడ్డాగా మారుతోంది. దుబాయ్ స్టార్టప్ కమ్యూనిటీలో 30% పైగా భారతీయ పెట్టుబడిదారులే ఉండటం విశేషం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సాంకేతిక పెట్టుబడిదారుల కోసం దుబాయ్ నగరం 100,000 గోల్డెన్ వీసాలను అందిస్తోంది. తద్వారా వారు 10 సంవత్సరాల వరకు దేశంలో నివసించడానికి వీలు కల్పిస్తోంది. దీనికి తోడు దుబాయ్ అమలు చేస్తోన్న జాతీయ చిన్న-వ్యాపార కార్యక్రమం స్టార్టప్‌లకు నిధుల, భాగస్వామ్యాలను సమకూర్చడంలో సహకరిస్తోంది. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దోహదపడే ఈ సహకార కార్యక్రమాలు.. దుబాయ్‌లో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతోంది.
గోల్డన్ వీసా అందుకున్న ప్రముఖులు
యూఏఈ గోల్డెన్ వీసాను ఇప్పటికే చాలామంది సినీ, క్రీడా ప్రముఖులు అందుకున్నారు. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, త్రిష, క్రితి సనన్, అమలాపాల్, కాజల్, బోనీ కపూర్, జాన్వికపూర్, మీనా, సానియా మిర్జా లాంటి వారికి గోల్డె్న్ వీసా ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తోంది. యూఏఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో అనేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలలో ఒకటి గోల్డెన్ వీసా. ఈ వీసా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సైన్స్, కళాకారులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ గోల్డెన్ వీసాలను అందిస్తోంది. గోల్డెన్ వీసా పథకాన్ని 2019 నుంచి అమలులో ఉంది. గోల్డెన్ వీసా హోల్డర్‌కు ప్రత్యేకాధికారాలు ఇస్తారు.
యూఏఈలోని భారత వాణిజ్య ప్రముఖులు..
2023 అక్టోబర్‌లో విడుదలైన ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ లిస్ట్‌లో యూఏఈలో ఉంటున్న భారత సంపన్నులు ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఐదుగురు కేరళకు చెందిన వారే ఉన్నారు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకే యూసఫాలి, ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్‌ఉమన్ రేణుకా జగ్తియాని, జోయ్ ఆలుకాస్ గ్రూప్ ఛైర్మన్ జోయ్ ఆలుకాస్, బుర్జీల్ హోల్డింగ్స్ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ షంషీర్ వయలిల్, ఆర్పీ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి పిళ్లై, జెమ్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఫౌండర్ సన్నీ వర్కీలు ఈ జాబితాలో ఉన్నారు.
భారత్-యూఏఈ మధ్య బలమైన సంబంధాలు..
భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత దశాబ్ధకాలంలో గణనీయంగా బలపడ్డాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్‌ను కూడా స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషి యూఏఈ ఈ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు యూఏఈ పాలకులు. భారత్‌తో యూఏఈకి మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు యూఏఈ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. మరో విశేషం ఏంటంటే, యూఏఈలో దాదాపు 30 శాతం మంది భారతీయులే ఉన్నారు.
యూఏఈ జనాభాలో భారతీయులు..
దాదాపు రెండు దశాబ్ధాల క్రితం యూఏఈ దేశ జనాభా కేవలం 41 లక్షలు మాత్రమే. అయితే 2023నాటికి ఆ దేశ జనాభా 99.7 లక్షలకు చేరుకుంది. ఆ దేశ జనాభాలో దక్షిణాసియా దేశాలకు చెందినవారే 59.4 శాతం ఉన్నారు. ఇందులో భారతీయులు 38.2 శాతం కాగా.. బంగ్లాదేశీయులు 9.5 శాతం, పాకిస్థానీలు 9.4 శాతం, ఇతరులు 2.3 శాతం మంది ఉన్నారు. ఆ దేశంలో స్థానికులుగా పరిగణించే ఎమిరాటీ అరబ్‌లు 11.6 శాతం మాత్రమే ఉన్నారు.
ఎన్నారైలలో 66 శాతం గల్ఫ్ దేశాలలోనే..
దాదాపు 210 విదేశాలలో 1.34 కోట్ల మంది ఎన్నారైలు ఉంటుండగా.. వీరిలో ఏకంగా 66 శాతం మంది యూఏఈతో సహా ఆరు గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, బహ్రయిన్‌లో దాదాపు 88.8 లక్షల మంది ఎన్నారైలు ఉంటున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 మార్చిలో ఓ ఆర్టీఐకి సమాధానంగా తెలిపింది. 2022 మార్చి నాటి గణాంకాల మేరకు యూఏఈలో 34.1 లక్షల మంది ఎన్నారైలు ఉంటుండగా.. సౌదీ అరేబియాలో 25.9 లక్షల మంది, కువైట్‌లో 10.2 లక్షల మంది, ఖతార్‌లో 7.4 లక్షల మంది, ఓమన్‌లో 7.7 లక్షల మంది, బెహ్రయిన్‌లో 3.2 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారు. ఆర్టీఐ ఇచ్చిన సమాచారం మేరకు అమెరికాలో 12.8 లక్షల మంది ఎన్నారైలు, యూకేలో 3.5 లక్షల మంది, ఆస్ట్రేలియాలో 2.4 లక్షల మంది, మలేషియాలో 2.2 లక్షల మంది, కెనడాలో 1.7 లక్షల మంది ఎన్నారైలు ఉంటున్నారు.