Russia Ukraine War: మూడో ప్రపంచం యుద్ధం అనివార్యమా? వస్తే ఏ దేశం ఎటువైపు.. భారత్ పరిస్థితి ఏంటి?
World War III: ఉక్రెయిన్ ఉరుముతోంది. రష్యా గర్జిస్తోంది. ఫలితంగా బాంబుల మోత మోగుతోంది. స్కడ్, మిసైల్స్ ప్రయోగాలే కాదు
World War III: ఉక్రెయిన్ ఉరుముతోంది. రష్యా గర్జిస్తోంది. ఫలితంగా బాంబుల మోత మోగుతోంది. స్కడ్, మిసైల్స్ ప్రయోగాలే కాదు సైరన్ శబ్దాలతో ఠారెత్తుతోంది. బతుకుజీవుడా అంటూ బంకర్లలో దాక్కోవాల్సి వస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందో తెలియడం లేదు. ఇప్పుడు అంతటా ఒకటే చర్చ. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా. మహాయుద్ధం వస్తే ఏయే దేశాలు ఎటువైపు ఉంటాయి. భారత్ పరిస్థితి ఏంటి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాల ముప్పు పొంచి ఉందా.. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని పుతిన్ ప్రకటించడం ఉత్కంఠను పెంచుతోంది. మూడో ప్రపంచం యుద్ధం వస్తే ప్రపంచంలోని 224 దేశాలు మూడు ముక్కలవడం ఖాయంగా కనిపిస్తోంది. 1945 తర్వాత ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. యుద్ధం చేసే వారి వైపు రెండుగా మిగతాదేశాలు చీలతాయి. ఎవరి వైపు కాకుండా తటస్ఠంగా ఉండే దేశాలు మూడోవైపు కానున్నాయి. ఊహాజనితమే అయినా వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం..
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.. నాలుగు కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్‌పై 14 కోట్లకు పైగా జనాభా ఉన్న రష్యా దాడి చేస్తోంది. అన్ని అస్త్రశస్త్రాలను వాడుతోంది. ఇటు ప్రాణ నష్టం, అటు ఆస్తి నష్టం జరుగుతోంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. యుద్ధం వద్దని చెప్పలేక అలాని ఊరుకోలేక తల్లడిల్లుతున్నాయి చాలా దేశాలు. రష్యాపై ఆంక్షలు విధించడం నాటోలోని 30 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) లోని 27 దేశాలకు సుతారం ఇష్టం లేదు. రష్యన్ సైనికుడు అడ్డంకులు తెలుసుకోవాలనుకోడు అనేది సామెత. ఇప్పుడు కీవ్ నగరంలో వారికి అదే ఎదురవుతోంది. తక్కువ మంది ఉన్నా.. ఉక్రెయిన్ వాసులు ధీటుగానే తిప్పికొడుతున్న తీరు ఆశ్చర్యమే. ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోతే తమ దేశం కోసం, తమ ప్రజల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వయంగా రంగంలోకి దిగడం కత్తిమీద సామె. రష్యాపై ఆంక్షలు విధిస్తే ఆర్థికంగా నష్టమే అయినా ఇటు ఈయూ అటు నాటో మరోవైపు మిగతా దేశాలు గట్టి హెచ్చరికలే పంపాయి. సమరానికి సై అంటున్న దేశాలే కాదు.. వాటితో పెట్టుబడులు పెట్టిన దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే వీలుంది. ముడిచమురు, గ్యాస్, ఆహారం, లోహాల విషయంలో ఆధిపత్యం ఉన్న రష్యాతో ఢీ అంటే ఢీ అనే దేశాలు కాస్త వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నాయి.
రష్యాకు మద్దతునిచ్చే దేశాలు.. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతలా రష్యాకు శత్రుదేశం అమెరికా. దానికి శత్రువు చైనా. కాబట్టి చైనా నుంచి రష్యాకి గట్టి మద్దతు ఉంది. ప్రపంచంలో అమెరికాకు ధీటుగా బదులిచ్చే దేశాల్లో ముందు వరుసలో ఉంది చైనా. అందులోను రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో మొదటి నుంచి చైనా-రష్యాల మధ్య గట్టి బంధమే ఉంది. ఉక్రెయిన్ కు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ( నాటో) ఏక పక్షంగా మద్దతునివ్వడంపై చైనా ధ్వజమెత్తుతోంది. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాలు చైనాను ఏకాకి చేసే ప్రయత్నం చేసినా రష్యా అండగా ఉంటూ వస్తోంది. చైనాకు 57,321 మిలియన్ డాలర్లు ఎగుమతులను (13.43 శాతం) పంపుతోంది రష్యా. అదే సమయంలో చైనా నుంచి 54,142 మిలియన్ల డాలర్లు దిగుమతులు( 21.91 శాతం వాటా) రష్యాకు వస్తున్నాయి. వాణిజ్యం, మిలటరీ, స్పేస్ వంటి రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాబట్టి డ్రాగన్ కంట్రీ ఓటు రష్యాకే.
ఆ ఆరుగురు.. 1991లో సోవియెట్ యూనియన్ ముక్కలైంది. 15 దేశాలుగా విడిపోయింది. అందులో ఉన్న అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్ రూటు ఇప్పుడు రష్యా వైపే. ఆ ఆరు దేశాలు రష్యాను వేరు పరచలేవు. అందుకే బెలారస్ లో ముందుగానే తమ యుద్ధ విమానాలను ఉంచిన పుతిన్ అక్కడ నుంచే ఉక్రెయిన్ పై దాడి మొదలెట్టాడు. ఈ దేశాల మధ్య కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీవో) ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా, అది తమ మీద దాడిగానే భావించాలి. ఒకరికొకరు సహకారం అందించుకోవాలనేది నియమం. అందుకే ఆ దేశాలు ఎప్పుడు ఒకటే.
పిట్ట కొంచెం కూత.. అమెరికాకు బద్ద శత్రుదేశం క్యూబా. చిన్నదేశమైన క్యూబాను ముప్పు తిప్పలు పెట్టినా అగ్రదేశం అమెరికాకు లొంగలేదు. పంచదార దేశమైన క్యూబా ఎప్పుడూ అండగానే ఉంటోంది. నాటో బలగాలు రష్యా సరిహద్దులకు వెళితే ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పింది.
2011లో సిరియాలో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు అండగా నిలిచింది రష్యా. సిరియాకు రష్యా మంచి మిత్రదేశం. కాబట్టి ఆ దేశం మద్దతు కచ్చితంగా రష్యాకే. పాపులిస్టు విధానాలతో ఆర్థిక రంగంలో పుంజుకున్న వెనెజులా మొదట్నుంచి రష్యాకు మిత్రుడే. ఇక మధ్య ప్రాచ్య దేశాల్లో ఇరాన్ మద్దుతు ఎప్పుడూ రష్యాకే ఉంటోంది. అమెరికాకు బద్ద శత్రువు ఇరాన్. అసలు ఇరాన్ తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మాములు విషయం కాదు. అప్పటి నుంచి ఇరాన్ రష్యాకు దగ్గరవుతోంది. ఇరాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రష్యా ఆయుధాలు సరఫరా చేసింది. అట్టు పెడితే అట్టున్నర పెట్టాలన్నట్లు ఇరాన్ రష్యాతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. అవసరాన్ని బట్టి సాయం చేస్తానంటోంది.
అతడి రూటే సెపరేటు.. మొండోడు మేధావి కంటే గట్టోడు అనేది సామెత. దక్షిణ కొరియానే కాదు.. అమెరికాకు చుక్కలు చూపిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్. అణు పరీక్షల ద్వారా అమెరికాకు నిద్రలేకుండా చేస్తున్నాడు. అలాంటి నార్త్ కొరియా రష్యాకు దన్నుగా ఉంది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసినప్పుడు అమెరికా ఆంక్షలు విధించే ఆలోచన చేసింది. కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారమున్న దేశాల్లో రష్యా ఉండటంతో అడ్డుపడినట్లైంది. ఐరాసలోని 192 దేశాలు సరే అన్నా.. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల్లోని ఒక్క దేశం కాదన్నా వెనక్కు తగ్గాల్సిందే. ఇక్కడ అదే జరిగింది. అమెరికాకు రష్యానే కాదు.. చైనా గట్టిగానే అడ్డుపడింది. మూడో ప్రపం యుద్ధం వస్తే ఉత్తర కొరియా రష్యా వైపే ఉంటుంది.
ఉక్రెయిన్ కు మద్దతునిచ్చే దేశాలేంటి.. రష్యాకు వైరి వర్గం అమెరికా. సహజంగానే అది ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తోంది. అసలు ఉక్రెయిన్ ఆ మాత్రం ఉందంటే అమెరికా ఉందనే ధీమానే. కాకపోతే రష్యా అణ్వస్త్రాలను తీస్తుందనే భయంతో ఏం చేయలేకపోతోంది అగ్రరాజ్యం. మరోవైపు బ్రిటన్ ఉక్రెయిన్‌కి అండగా నిలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. రష్యా పై ఆంక్షలు విధిస్తోంది.
నాటో కూటమిలో ఉన్న 30 యూరప్ దేశాలైన ఆల్భేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రోయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈస్తోనియా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్ లాండ్, ఇటలీ, లాత్వియా, లుధేనియా, లక్సంబర్గ్, మాంటినిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రుమేనియా, స్లోవేకియా, సాల్వినియా, స్పెయిన్, టర్కీ, యూకే, అమెరికా మద్దతు ఉక్రెయిన్‌కే ఉంది. పైకి చెప్పకపోయినా రష్యా పై ఆంక్షలు విధించేందుకే వారి మొగ్గు ఉంది. వారు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఉక్రెయిన్ నాటో దేశం కాకపోవడంతో వారెవరు రష్యా పై దండెత్తే అవకాశం లేదు. కాకపోతే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్‌ల్యాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్ దేశాలు మొదటి నుంచి ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్నాయి.
రష్యా తీరును మొదట్నుంచి వ్యతిరేకిస్తోంది పోలెండ్. ఉక్రెయిన్‌కి చమురు, ఆయుధ సరఫరా చేస్తోంది. రష్యాను తప్పుపడుతూ మిగతా దేశాలను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. పెద్ద దేశమైన జర్మనీ చాన్స్‌లర్ ఉలఫ్ స్కాల్జ్ రష్యా యుద్ధం చేయవద్దని చెబుతూ వస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానేయల్ మాక్రాన్ కూడా రష్యా వెనక్కు తగ్గాలని మొదటి నుంచి పిలుపునిస్తున్నాడు. రష్యాకి నచ్చజెప్పేందుకు ఆ రెండు దేశాలు బాగానే ప్రయత్నించాయి. ఉక్రెయిన్ లోని లుహాన్స్, డోనెస్కీలను స్వతంత్ర హోదా కల్పిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేయడం వారికి మరింతగా ఆగ్రహం తెప్పించింది. అంతే తాము ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటామని చెప్పాయి. జర్మనీ అయితే రష్యాతో చేసుకున్న వాణిజ్యం బంధాలపై పునరాలోచన చేస్తామని హెచ్చరించింది. నార్డ్ స్ట్రీమ్ గ్యాప్ పైప్‌లైన్-2 ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు జర్మనీ ప్రకటించడం రష్యాకు పెద్ద దెబ్బ.
బ్రిటన్ (UK) కూడా రష్యా పై ఆంక్షల కొరఢా ఝళిపించింది. రష్యా బ్యాంకుల సేవలను పూర్తిగా రద్దు చేసింది. యూకే మార్కెట్లో రష్యా పెట్టుబడులు పెట్టవద్దని ఆదేశాలిచ్చింది. రష్యా నుంచి ఎవరూ ఇటువైపు రావద్దని చెప్పేసింది. బ్రిటన్ కు వచ్చే రష్యా ఎయిర్‌లైన్స్‌పై నిషేధం విధించింది. హైటెక్, రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపేసింది.
ఇక దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించాయి చిన్న దేశమైన చెక్ రిపబ్లిక్ తన మద్దతుదారులతో కలిసి ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని చెప్పింది. వారే కాదు యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈయూ చీఫ్ ఉర్సులా లెయెన్ రష్యా దాడిని ఖండించడమే కాదు.. రక్తపాతం వద్దని రష్యాను హెచ్చరిస్తోంది.
గోడమీద పిల్లులు.. ఉక్రెయిన్-రష్యా విషయంలో భారత్‌తో పాటు చాలా దేశాలు తటస్థ వైఖరి అవలింబిస్తున్నాయి. ఉక్రెయిన్-భారత్ మధ్య ఏటా 2.5 బిలియన్ డాలర్లు (రూ.19,000 కోట్లు) వర్తకం సాగుతోంది. లోహాలు, ప్లాస్టిక్, పాలీమర్స్, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటున్నాం. రెడ్డీ ల్యాబ్స్, సన్ వంటి కంపెనీల నుంచి మందులు, మిగతా ప్రాంతాల నుంచి యంత్ర సామగ్రి, రసాయనాలు, ఆహారపదార్థాలను అక్కడకు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు రష్యాతోను వాణిజ్యం బాగానే సాగుతోంది. 2020-21 8.1 బిలియన్ డాలర్ల వాణిజ్యం ( సుమారు రూ.61,000 కోట్లు)భారత్ -రష్యా మధ్య జరిగింది. రష్యాకు మనం 2.6 బిలియన్ డాలర్లు ( రూ. 19,500 కోట్లు) విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తుండగా అక్కడ నుంచి 5.5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవైపు కోపు తీసుకుంటే మరోవైపు ఇబ్బంది ఎదురవుతోంది.
ఇటు రష్యా, అటు అమెరికాతోనూ మనకు మంచి సంబంధాలున్నాయి. అందుకే శాంతి శరణం పఠిస్తున్నాం. చైనాతో గల్వాన్ సరిహద్దుల్లో యుద్ధం వచ్చినప్పుడు రష్యా సాయం కావాలనుకుంది భారత్. చైనా, రష్యాలు స్నేహితులు కాబట్టి పుతిన్ ద్వారా చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత్ వ్యవహరిస్తోంది. మనం వాడే ఆయుధాల్లో 50 శాతం రష్యా నుంచి కొనుగోలు చేసినవే. అంతే కాదు.. ఒకదేశం వైపు మొగ్గు చూపితే నాటో, ఈయూ కూటమిలోని సభ్య దేశాలు భారత్ కు వైరి వర్గంగా మారే వీలుంది. అంత అవకాశం ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే భారత్ గోడమీద పిల్లవాటంలా ఉంది. భారత్ వైఖరిని రష్యా స్వాగతిస్తుంటే ఉక్రెయిన్‌కు కోపం వస్తోంది. ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఫోన్ చేసి మరీ మద్దతు కోరినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.
Also read:
Viral News: కన్నతల్లితోనే ఛాలెంజ్ చేశాడు.. ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.. అసలు విషయం తెలిస్తే షాకే..
Funny Video: అరెరె ఎంత పని అయిపాయెరా.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌కు వారి మైండ్ బ్లాంక్ అయ్యింది..!
Viral Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. వైరల్ అవుతున్న వీడియో.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..!