UK Heat Wave: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్‌లో భానుడి ప్రతాపం.. స్కూళ్లకు సెలవులు, బీచ్‌ల బాట పడుతోన్న జనాలు..
UK Heat Wave: సమ్మర్‌లో కూడా కూల్‌గా బ్రిటన్ ఇప్పుడు భారీ ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతోంది. భానుడి భగభగలతో విలవిల్లాడుతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో...
UK Heat Wave: సమ్మర్‌లో కూడా కూల్‌గా బ్రిటన్ ఇప్పుడు భారీ ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతోంది. భానుడి భగభగలతో విలవిల్లాడుతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..ఉష్ణోగ్రత అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది..2019లో బ్రిటన్‌లో పగటి పూట అత్యధికంగా 38.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ రికార్డ్ మళ్లీ ఇప్పుడు బ్రేక్ అయింది. ఉష్ణోగ్రత ఏకంగా 40 దాటింది.ఆ నగర చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. భారీ ఉష్ణోగ్రతలు రవాణా సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. అనేక చోట్ల వాహనాలు మొరాయిస్తున్నాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోతున్నాయి.
ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా విమాన ప్రయాణాల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూకేలో పరిస్థితులు సహారా ఎడారిని తలపిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటేనే పరిస్థితుల ఎలా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఎండల తీవ్రతతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎండల ధాటికి తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్‌లో సేద తీరుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అటు యూరోప్ అడువుల్లో చెలరేగుతున్న దావానలం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పశ్చిమ యూరోప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. ఉత్తరం దిశగా ఆ బలమైన హీట్‌వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు బ్రిటన్‌లో హీట్ వార్నింగ్ జారీ చేశారు. ఇక స్పెయిన్‌లో ఏకంగా 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్ దేశాల్లో కార్చిచ్చులు చుట్టేస్తున్నాయి. దీంతో వేలాది మంది జనం నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. హీట్ వేవ్ కారణంగా స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మందికిపైగా మరణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..