UK PM Race: బ్రిటీష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునక్.. నాలుగో రౌండ్‌లో కూడా 118 ఓట్లతో అగ్రస్థానంలో..
Rishi Sunak: రిషి సునక్ దూసుకుపోతున్నారు. నాలుగో రౌండ్‌లో ఆయనకు 118 ఓట్లు వచ్చాయి. దీంతో మాజీ ఈక్వాలిటీ మినిస్టర్ కమీ బడెనోచ్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు.
బ్రిటీష్ ప్రధాని రేసులో(UK PM Race) భారతీయ సంతతికి చెందిన రిషి సునక్(Rishi Sunak)దూసుకుపోతున్నారు. నాలుగో రౌండ్‌లో ఆయనకు 118 ఓట్లు వచ్చాయి. దీంతో మాజీ ఈక్వాలిటీ మినిస్టర్ కమీ బడెనోచ్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు. ఆయనకు 59 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రేసులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. బిజినెస్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్‌కు 92, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్‌కు 86 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు తదుపరి రౌండ్‌లో సునక్, పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది.
బుధవారం జరిగే ఐదో రౌండ్ ఓటింగ్ తర్వాత చివరి ఇద్దరు అభ్యర్థుల పేర్లు తేలిపోనున్నాయి. దీని తర్వాత టోరీ పార్టీ సభ్యత్వానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. ఈ సభ్యుల సంఖ్య దాదాపు 160,000 అని అంచనా.. వీరు ఈ ఇద్దరు అభ్యర్థులలో ఎవరికైనా అనుకూలంగా ఓటు వేస్తారు. ఆ ఓట్లను ఆగస్టు చివరిలో లెక్కించి సెప్టెంబర్ 5లోగా విజేతను ప్రకటిస్తారు.
గురువారం వరకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే తుది జాబితాలోకి రానున్నారు. సోమవారం జరిగిన మూడో రౌండ్ ఓటింగ్‌లో మాజీ ఆర్థిక మంత్రి సునక్‌కు 115 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో రౌండ్‌లో 101 ఓట్లు రాగా, తొలి రౌండ్‌లో 88 ఓట్లు వచ్చాయి. సునక్ అన్ని దశల్లోనూ అగ్రస్థానంలో ఉన్నాడు.
మంత్రుల రాజీనామా తర్వాత బోరిస్ జాన్సన్ ఇటీవలే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తులలో సునక్ ఒకరు. జాన్సన్ రాజీనామాతో 42 ఏళ్ల సునక్ ప్రధానమంత్రి కోసం ప్రచారం ప్రారంభించాడు.