MP David Amess: బ్రిటన్‌లో దారుణం.. సమావేశంలో ఎంపీ దారుణ హత్య.. పలుమార్లు కత్తితో..
MP David Amess: బ్రిటన్‌లో దారుణం చోటుచేసుకుంది. యూకెకు చెందిన ఓ ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లాండ్ ఎసెక్స్‌లోని
UK MP David Amess: బ్రిటన్‌లో దారుణం చోటుచేసుకుంది. యూకెకు చెందిన ఓ ఎంపీ దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లాండ్ ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్ అమెస్ (69) శుక్రవారం లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో పౌరులతో సమావేశానికి హాజరయ్యారు. పౌరులతో సమావేశం జరుగుతున్న క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై అకస్మాత్తుగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు డేవిడ్ అమెస్‌ను పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఎంపీను స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అనతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీక్లీ మీటింగ్‌లో ఎంపీపై దాడి జరిగిందని.. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఘటనా స్థలంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కౌన్సిలర్, సౌత్‌ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని నిర్ధారించారు. కాగా ఈ ఘటన బ్రిటన్‌లో కలకలం రేపింది.
డేవిడ్ అమెస్.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు. 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. జంతు సమస్యలు, మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా, పలు సమస్యలపై పోరాడిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన మృతిపై ప్రధాని బోరిస్ జాన్సన్ సహా..పలువురు ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించి.. కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ ఘటన భయంకరమంటూ అభివర్ణించారు. గతంలోనూ పలువురు బ్రిటీష్ ఎంపీలపై దాడులు జరిగాయి. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్‌ను దుండగులు కాల్చి చంపారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ సైతం కత్తిపోట్లకు గురయ్యారు.
Also Read: