Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం.. తగ్గమంటున్న అమెరికా, తగ్గేదేలే అంటున్న జెలెన్‌స్కీ..
ఎనిమిది నెలలుగా సాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. త్వరలో ఈ వార్‌కు బ్రేక్ పడుతుందా.. అసలు అమెరికా సహా మిత్రదేశాల వాదనేంటి..
ఎనిమిది నెలలుగా సాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. త్వరలో ఈ వార్‌కు బ్రేక్ పడుతుందా.. అసలు అమెరికా సహా మిత్రదేశాల వాదనేంటి.. జెలెన్‌స్కీ రియాక్షనేంటి..? ఈ పరిణామాల మరింత ఆసక్తి రేపుతున్నాయి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలని అమెరికా ఆదేశించిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చర్చలకు మార్గాలు మూసివేస్తే మిత్రపక్షాలు అలసిపోయే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. రష్యాతో చర్చలపై ఉక్రెయిన్ వైఖరి, ఆర్థిక నష్టాల భయాలతో మిత్రపక్షాలు కూడా ఇంకెన్నాళ్లీ యుద్ధం అంటున్నాయి.
అయితే, తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా ప్రతిపాదనపై రియాక్ట్ అయ్యారు. క్రిమియా సహా రష్యా ఆక్రమించుకున్న భూభాగాల నుంచి మాస్కో దళాలు వైదొలిగితేనే చర్చలకు కీవ్ సిద్ధపడుతుందని తేల్చిచెప్పారు. అలాగే ఉక్రెయిన్ గడ్డపై నేరాలకు పాల్పడ్డ రష్యన్లను కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను చర్చలు జరపనని.. పుతిన్ వారసుడితోనే తాను చర్చిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు 18.9 బిలియన్ డాలర్ల విలువైన సాయం అందింది. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.
కానీ మిత్ర దేశాలు ఈ యుద్ధం కారణంగా ఇంధనం, ఆహారం ధరలు పెరిగిన భారంతో ఇబ్బంది పడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇలాగే కొనసాగితే..రాజధాని కీవ్‌కు ఈ శీతాకాలం ఓ పీడకలలా మారనుంది. గత నెలంతా ఉక్రెయిన్ విద్యుత్తు మౌలిక సదుపాయాల ధ్వంసంపై రష్యా దృష్టి పెట్టింది. ఫలితంగా దేశమంతా విద్యుత్ కోతలు, అంతరాయాలు పెరిగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..