Afghan Crisis: ఆప్ఘాన్ పరిణామాలతో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉందంటే..

Afghan Crisis: ఆప్ఘాన్ పరిణామాలతో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉందంటే..
Afghanistan Crisis

ఆఫ్గనిస్తాన్‌లో రెండు దశాబ్దాల తరువాత అరాచక తాలిబన్ల పాలన మొదలవుతోంది. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వారి వశం అయింది.

KVD Varma

| Edited By: Janardhan Veluru

Aug 16, 2021 | 6:32 PM

Afghan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో రెండు దశాబ్దాల తరువాత అరాచక తాలిబన్ల పాలన మొదలవుతోంది. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వారి వశం అయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్ దేశం విడిచి వెళ్లిపోయారు. మొదట తజికిస్తాన్ వెళ్లిన వారు తరువాత ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌ చేరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచం మొత్తం అఫ్గాన్ పరిస్థితిపై చర్చ మొదలైంది. ప్రస్తుత సంక్షోభం పై కొన్ని దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) అఫ్గాన్‌లో పరిణామాలు ఆందోళనకరమని అంటోంది. అదేవిధంగా హింసను పక్కన పెట్టాలని, కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలనీ ఓఐసీ కోరింది. శాంతి స్థాపనలో తాము క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ప్రకటించింది.

ఆందోళనలో ఇరాన్..

ఆఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగునున్న ఇరాన్ ఆందోళన చెందుతోంది. ఆఫ్గాన్ నుంచి పారిపోతున్న సైనికులు ఇరాన్‌లో ఆశ్రయం పొందడమే ఇందుకు కారణం. కాబూల్, హెరాత్‌లలోని తమ దౌత్యవేత్తలు, సిబ్బందికి హాని చేయవద్దని ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. సున్నీల నేతృత్వంలోని తాలిబాన్ల పై షియా ఆధిక్య దేశమైన ఇరాన్ మొదట్నుంచి ఆందోళన చెందుతూ వస్తోంది. 1988లో మజర్-ఏ-షరీఫ్‌ లో ఇరాన్‌కు చెందిన ఒక జర్నలిస్టు, ఎనిమిది మంది దౌత్యవేత్తలు హత్యకు గురయ్యారు. దీనికి స్పందనగా ఇరాన్ దాడి చేయాలనుకుంది. అయితే, ఆ తర్వాత తాలిబాన్లు, ఇరాన్‌ల మధ్యస్నేహ సంబంధాలు పెరిగాయి. గత జులైలో ట్రెహాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రితో తాలిబాన్ల బృందం చర్చలు జరిపాయి.

అఫ్గానిస్తాన్‌కు అమెరికా లేఖ

హింసను అదుపు చేసి, 90 రోజుల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కు లేఖ రాసింది.

సరిహద్దు దేశాల్లో కలవరం..

ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్ ఈ మూడు మధ్య ఆసియా దేశాలు అఫ్గాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి. అఫ్గాన్‌ సంక్షోభం ప్రభావం ఈ దేశాలపై ఎక్కువగా పడుతోంది. శరణార్థులు పెద్ద సంఖ్యలో ఈ దేశాలకు వలస వెళ్తున్నారు.  దీంతో, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ తమ సరిహద్దులను కట్టుదిట్టం చేశాయి. గత జులైలో కొందరు అఫ్గాన్ జవాన్లు ఉజ్బెకిస్తాన్‌కు పారిపోయారు. ఆ తర్వాత అఫ్గాన్‌లోని తమ బలగాలను ఉజ్బెకిస్తాన్ ఉపసంహరించుకుంది. మరోవైపు తజికిస్థాన్ తమ సరిహద్దులు కట్టుదిట్టం చేస్తోంది. సరిహద్దుల వెంబడి నిఘా కోసం దాదాపు 20,000 మంది సైనికుల్ని అదనంగా మోహరించింది.  తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు రెండూ ఉమ్మడి సహకారంతో ముందుకెళుతున్నాయి.  సంయుక్తంగా ఈ దేశాలు సైనిక ఆపరేషన్లు చేస్తున్నాయి.

ఇక మరోవైపు తుర్క్‌మెనిస్తాన్ తాలిబాన్లతో బంధాలను బలపరుచుకుంటోంది. ఈ క్రమంలో చర్చల కోసం తాలిబాన్ నాయకులకు తుర్క్‌మెనిస్తాన్ ఆహ్వానం పలికింది. ఇదిలా ఉంటె..పొరుగు దేశాలకు తమ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని  తాలిబాన్లు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని ప్రాంతాలను ఆక్రమించే ఉద్దేశించే లేదని ప్రకటించారు. అయినా ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, తజికిస్తాన్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

టర్కీ..

ఇక టర్కీ తాలిబన్లతో సై అంటే సై అంటోంది. హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతోంది. ఈ విమానాశ్రయం విధులు నిర్వర్తించడం చాలా అవసరం అని టర్కీ అంటోంది. అందుకే తాము నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంపై తాలిబాన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టర్కీ తమ బలగాలను విమానాశ్రయానికి పంపితే ఊరుకునేది లేదన్న తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించాలని టర్కీ కోరుతోంది. తమ దేశంలో ఏ విదేశీ జోక్యం అవసరం లేదని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. నాటో సభ్య దేశాల్లో టర్కీ కూడా ఒకటి. అఫ్గాన్‌లో టర్కీ బలగాలు లేకపోయినా నాటో సైనిక చర్యలకు టర్కీ మద్దతు ఇచ్చింది. తాలిబాన్లతో పోరాడిన కమాండర్ మార్షల్ దోస్తోమ్‌తో టర్కీకి మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌కు దోస్తోమ్ పారిపోయాడు. మజర్-ఏ-షరీఫ్ నగరంలోనూ టర్కీ పెట్టుబడులు పెట్టింది.

టర్కీని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ పాచికలు..

పాకిస్థాన్‌కు, టర్కీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదేసమయంలో పాకిస్తాన్‌కూ తాలిబాన్లకూ మధ్య కూడా మంచి సంబంధాలున్నాయి. అఫ్గాన్‌లో భవిష్యత్‌లో టర్కీ క్రియాశీల పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. తాలిబాన్లు, టర్కీలని దగ్గర చేసేందుకు పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో చర్చలకు ఈ సంబంధాలను పాక్ ఉపయోగించుకునే వీలు కనిపిస్తోంది. అయితే, తమపై పాక్ ప్రభావం ఉందన్న వాదనలను తాలిబాన్లు ఖండిస్తున్నారు. కానీ, పాకిస్తాన్‌ను తాము మంచి మిత్రదేశంగా చూస్తామని ప్రకటించారు.

పాకిస్తాన్‌..

పాక్ లో దాదాపు 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య 2500 కి.మీ. పొడవైన సరిహద్దులు ఉన్నాయి. తాలిబాన్‌లకు పాక్ అత్యంత కీలకమైన పొరుగు దేశం. అఫ్గాన్‌ నుంచి తాము ఎలాంటి ప్రయోజనాలనూ ఆశించడంలేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. అయితే, అఫ్గాన్ సంక్షోభంలో మొదట్నుంచీ పాక్ క్రియాశీల పాత్ర పోషిస్తూ వస్తున్న విషయం గమనార్హం.  ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రభుత్వ ప్రతినిధులతో అఫ్గాన్ ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తాలిబాన్లను పాక్ ప్రభుత్వం ప్రోత్సహించిందని గతంలోనే అఫ్గాన్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాష్కెంట్‌లో అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంపై చర్చలు జరిపారు.

సౌదీ అరేబియా, యూఏఈ.. ప్రపంచంలో అతిపెద్ద సున్నీ ముస్లింల దేశం సౌదీ అరేబియా. అఫ్గానిస్తాన్ విషయంలో మాత్రం సౌదీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇటు అఫ్గాన్, అటు పాక్ రెండు దేశాలతోనూ సౌదీకి మంచి సంబంధాలున్నాయి. తాలిబాన్లతోనూ సౌదీకి సంబంధాలు బాగానే ఉన్నాయి. 2018లో ఖతర్‌లో అమెరికా, తాలిబాన్ల మధ్య చర్చలు జరిగాయి. అప్పటి నుంచీ, సౌదీ వ్యూహాత్మక దూరం.

పాకిస్తాన్ సాయంతో అఫ్గాన్‌లో ఆధిపత్యం చెలాయించాలని సౌదీ అరేబియా చూస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా అఫ్గాన్‌లోని ముజాహిదీన్‌లను 1980-90ల్లో సౌదీ ప్రోత్సహించింది. ఇక మరో సున్నీ ముస్లిం దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ సంక్షోభం నుంచి వ్యూహాత్మక దూరం పాటిస్తోంది.

ఖతర్..

చిన్న ముస్లిం దేశాల్లో ఖతర్ ఒకటి. అఫ్గాన్ సంక్షోభంలో ఇది మొదట్లో క్రియాశీల పాత్ర పోషించింది. తాలిబాన్ల రాజకీయ కార్యాలయం ఖతర్‌లోని దోహాలోనే ఉంది. ఖతార్ అమెరికా మిత్ర దేశం. తాలిబాన్లతో చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది ఖతార్. రెండు వర్గాలకూ మౌలిక సదుపాయాలను ఖతర్ కల్పించింది.

ఇదీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల నేపథ్యంలో వివిధ ముస్లిం దేశాల వ్యూహాలు. భవిష్యత్ లో ఇవి ఏ రూపు తీసుకుంటాయనేది చెప్పడం కష్టం. తాలిబన్లు తీసుకునే నిర్ణయాలపై ఇతర ముస్లిం దేశాలు తీసుకునే వైఖరి ఆధారపడి ఉంటుంది.

Also Read: Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన

అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారీ పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu