Sweden PM: ప్రదానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి మహిళగా రికార్డు.. పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా!

స్వీడన్ దేశ రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశంలో అత్యున్నత పదవికి తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించింది మగ్దలీనా ఆండర్సన్.

Sweden PM: ప్రదానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి మహిళగా రికార్డు.. పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా!
Sweden Pm Magdalena Andersson
Follow us

|

Updated on: Nov 25, 2021 | 3:08 PM

Sweden PM Magdalena Andersson: స్వీడన్ దేశ రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశంలో అత్యున్నత పదవికి తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించింది మగ్దలీనా ఆండర్సన్. అయితే, ఆ పదవిని చేపట్టిన కాసేపటికే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు, ఆమె నేతృత్వం వహిస్తున్న కూటమి నుంచి గ్రీన్స్ పార్టీ వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఆమె రెండు పార్టీలతో కలిసి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంటు మద్దతు లభించకపోవడంతో వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

మగ్దలీనా ఆండర్సన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురైంది. దీంతో ప్రతిపక్షం ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుకూలంగా 154 ఓట్లు, ప్రతికూలంగా 143 ఓట్లు లభించాయి. దీంతో ఆండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ప్రధాన మంత్రి పదవికి బుధవారం రాజీనామా సమర్పించారు. ఆమె స్వీడన్ ప్రధాన మంత్రిగా సుమారు 7 గంటలపాటు మాత్రమే ఉన్నారు. స్వీడన్ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించిన మగ్దలీనా ఆండర్సన్.. గంటల వ్యవధిలోనే పదవిని వదులుకున్నారు. దీంతో అతి తక్కువ కాలం పాటు ఆదేశ ప్రధానిగా పనిచేసిన నేతగా ఆమె మరో రికార్డు సొంతం చేసుకున్నారు.

అనంతరం ఆండర్సన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇది గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. ప్రభుత్వ చట్టబద్ధతను, నియమబద్ధతను ప్రశ్నించే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడపటం తనకు ఇష్టం లేదన్నారు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని సంకీర్ణ ప్రభుత్వంలోని ఓ పార్టీ నిర్ణయించుకుంటే, ఆ సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలన్నారు.

ఇదిలావుండగా, తాను సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమేనని పార్లమెంటరీ స్పీకర్ ఆండ్రియాస్ నోర్లెన్‌కు ఆండర్సన్ తెలిపారు. దీంతో నోర్లెన్ స్పందిస్తూ, తాను ఎనిమిది పార్టీల నేతలతో సంప్రదిస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన ఓ విధానాన్ని ఆయన గురువారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన గ్రీన్ పార్టీ మరోసారి ప్రధాన మంత్రి పదవి కోసం జరిగే ఎన్నికలో ఆండర్సన్‌కు మద్దతిస్తామని ప్రకటించింది.

Read Also….  Digital Banks: దేశంలో డిజిటల్ బ్యాంకులు.. ప్రతిపాదించిన నీతి ఆయోగ్..