గాల్లో కలిసిన 179 మంది ప్రాణాలు.. దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..?
దక్షిణ కొరియాలోని మువాన్ నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో 179 మంది మరణించారు.. 181 మందిలో ఇద్దరు మాత్రమే బతికినట్లు చెబుతున్నారు.. అసలు.. దక్షిణకొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి? ల్యాండింగ్ గేర్ వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందా? టైర్లు పనిచేయకపోవడమే కారణమా? అధికారులు ఏం చెబుతున్నారు..
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం చోటుచేసుకుంది.. ఆదివారం ఉదయం జరిగిన విమాన ప్రమాదం 179 మందిని మింగేసింది. 175 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే విమాన ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. విమానం నేలపైకి దిగే సమయంలో టైర్లు పనిచేయలేదన్నారు అధికారులు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే టైర్లు పనిచేయకపోయి ఉండొచ్చని అంటున్నారు. థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు చెందిన ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 బోయింగ్ విమానం మయూన్ ఎయిన్‌పోర్టులో ఉదయం 9 గంటల ప్రాంతంలో ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విమానం నేలపైకి దిగిన తర్వాత రన్‌వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైందంటున్నారు. విమానం వేగం కంట్రోల్ కాకపోవడంతో ఎయిర్‌పోర్టు గోడను ఢీకొంది. దీంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమాన ప్రమాదం తర్వాత ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.
విమాన ప్రమాదంపై దక్షిణకొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఫ్లైట్ క్రాష్‌పై థాయ్‌ల్యాండ్‌కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు.
కెనడాలో మరో ప్రమాదం..
179 మంది బలైన దక్షిణ కొరియా విమాన ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే కెనాడాలో మరో విమాన ప్రమాదం జరిగింది.. కెనడాలోని హాలీఫాక్స్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. హైడ్రాలిక్ సమస్యతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్.. రన్‌వేపై విమానం రెక్కలు క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయని.. వెంటనే రెస్క్యూ చేసినట్లు అధికారులు తెలిపారు.
గత వారం కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో జరిగిన అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్ విమాన ప్రమాదంలో 38 మంది మరణించారు.. 67 మందిలో 29 మంది గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..