Afghanistan Crises: కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురు అఫ్గాన్ పౌరుల మృతి, పలువురికి తీవ్రగాయాలు
ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.
Kabul Airport Chaos: ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని, అరాచకం సృష్టిస్తున్న తాలిబన్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాలిబన్లతోపాటు పాకిస్థాన్‌ను కూడా నిరసనకారులు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఆఫ్ఘన్లు, బలూచ్‌లు, కుర్దులు వందలు, వేల మంది రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మృతులంతా ఆఫ్ఘన్ పౌరులేనని స్పష్టం చేసింది. దేశం వదిలి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకున్న ఆఫ్ఘన్ పౌరులను చెదరగొట్టేందుకు తాలిబన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాకు చెందిన భద్రతా బలగాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను సునాయాసంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం తాలిబన్లు షరియా ప్రకారం పాలన ఉంటుందని ప్రకటించారు. స్వేచ్ఛ కల్పిస్తామని నమ్మబలుకుతూనే తమ నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టారు. బాలికలను ఎత్తుకుపోవడమేకాక సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు. ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ మహిళలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక ప్రజలు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపోయేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయం వద్ద రద్దీ పెరిగిపోయింది. దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు తాలిబన్లు పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు.
మరోవైపు తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘన్‌కు విముక్తి కల్పించాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. గ్రీస్‌లోని తెస్సలోనికి నగరంలో వందలాది మంది ఆఫ్ఘన్లు, బలూచ్‌లు, కుర్దులు వీథుల్లోకి వచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జెండాలతో వచ్చిన వీరంతా పాకిస్థాన్, తాలిబన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాలిబన్లకు పాకిస్థాన్ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, లండన్‌లో శనివారం తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్‌లోని హైదర్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు మద్దతుగా, తాలిబన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రోమ్ నగరంలోని రిపబ్లికా స్క్వేర్ వద్ద తాలిబన్లకు వ్యతిరేకంగా ఆదివారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. పష్తూన్, ఉజ్బెక్, తజిక్ కమ్యూనిటీలకు చెందిన ఆఫ్ఘన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాలిబన్లకు, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బ్యానర్లను ప్రదర్శించారు. ఆఫ్ఘన్ పౌరులకు సంఘీభావం తెలుపుతూ అనేక మంది ఇటాలియన్లు, మీడియా సిబ్బంది కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.