Sanna Marin: బ్రేక్ ఫాస్ట్ బిల్లులను తిరిగి చెల్లించనున్న ప్రధాని.. ఆరోపణలతో వెనక్కి తగ్గిన సన్నా మారిన్
ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి సన్నా మరీన్ వెనక్కి తగ్గారు. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరలేవడంతో యూటర్న్ తీసుకున్నారు. గత ఏడాదిన్నరగా ప్రభుత్వ ఖజానా నుంచి తనకు చెల్లించిన బ్రేక్ ఫాస్ట్ బిల్లులను...
Sanna Marin to re-pay breakfast bills: ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి (Finland Prime Minister) సన్నా మరీన్ వెనక్కి తగ్గారు. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరలేవడంతో యూటర్న్ తీసుకున్నారు. గత ఏడాదిన్నరగా ప్రభుత్వ ఖజానా నుంచి తనకు చెల్లించిన బ్రేక్ ఫాస్ట్ బిల్లులను (Breakfast Bills) తిరిగి చెల్లించాలని ఫిన్‌ల్యాండ్ (Finland) ప్రధాని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఈ మేరకు ఆమె 14000 యూరోలు (దాదాపు 17000 అమెరికన్ డాలర్లు) ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వ ఖజానాకు తిరిగి చెల్లించనున్నారు.
ప్రపంచంలో అత్యంత పిన్న వయస్సులో ఓ దేశ ప్రధాని అయిన ఘనతను సొంతం చేసుకున్న సన్నా మారీన్ కరోనా పాండమిక్ (Corona Pandemic) కాలంలో ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకున్నారు. మన దేశప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సైతం ఆమె పలుమార్లు వర్చువల్ విధానంలో మాట్లాడి గత సంవత్సరం కరోనా వైరస్ (Corona Virus) కట్టడిలో విజయం సాధించారు. అయితే ఇటీవల కాలంలో ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాని అధికారిక నివాసంలో తన మొత్తం కుటుంబంతో కలిసి వుంటున్న సన్నా మారిన్ ఆ కుటుంబానికి అయ్యే బ్రేక్ ఫాస్ట్ ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి క్లెయిమ్ చేసుకుంటోంది. గత ఏడాదిన్నరగా సుమారు 14 వేల యూరోలను ఆమె బ్రేక్ ఫాస్ట్ బిల్లుగా క్లెయిమ్ చేసుకున్నారు.
అయితే.. ఇటీవల కాలంలో ఈ అంశాన్ని ఫిన్‌ల్యాండ్ మీడియా (Finland Media) బ్రేక్ చేసింది. దాంతో విపక్షాలు సన్నా వ్యవహార శైలిపైనా.. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపైనా విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు రావడం.. అదే సమయంలో ఫిన్‌ల్యాండ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అధికార పార్టీ ఓటమి పాలై విపక్ష పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో సన్నా మారీన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాను గత ఏడాదిన్నరగా క్లెయిమ్ చేసుకున్న బ్రేక్ ఫాస్ట్ బిల్లుల మొత్తాన్ని జూన్ మొదటి వారాంతానికి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇదే అంశాన్ని ఆమె ఎంటీవీ3 కిచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. అదే సమయంలో తన వివాహానికి సంబంధించిన ఖర్చులను కూడా తొలుత ప్రభుత్వం భరించినా.. ఆ తర్వాత వాటిని తాను తిరిగి చెల్లించానని సన్నా క్లారిటీ ఇచ్చారు.
Jaahas. Nyt leviää väite, että häidemme lasku olisi maksettu valtion rahoista. Ei ole! Olemme maksaneet kaikki hääkulumme itse kuten ruuat, juomat, henkilökunnan, kukat, koristeet, valokuvaajat ja musiikin. Ihan itse laitoin hiukset ja meikin, kuten joka päivä.
— Sanna Marin (@MarinSanna) May 31, 2021
తనకు ప్రధానిగా ఇతర ముఖ్యమైన అంశాలెన్నో చూడాల్సిన అవసరం వుందని.. ఈ చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం అవసరం లేదని తాను భావిస్తున్నానని సన్నా అన్నారు. అందుకే ఈ వివాదానికి ఇంతటితో తెరవేయాలనే ఉద్దేశంతో బ్రేక్ ఫాస్ట్ బిల్లులను తిరిగి చెల్లిస్తున్నానని ఆమె తెలిపారు. అయితే.. ఈ బిల్లులను తనకు చెల్లించాలని తాను ఎవరినీ ఆదేశించలేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని సన్నా అంటున్నారు. మరోవైపు ఫిన్‌ల్యాండ్ పోలీసులు, పన్నుల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ బిల్లులను అక్రమంగా ప్రధానమంత్రి క్లెయిమ్ చేసుకున్నట్లైతే ఆమెకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు అంటున్నారు.