Pakistan Vaccine: పాకిస్తాన్ కరోనా వ్యాక్సిన్ రెడీ.. పాక్‌వాక్ పేరుతో టీకా..పాక్ కు సహాయం చేసిన చైనా!
Pakistan Vaccine: కరోనావైరస్ కోసం దేశీయ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. దీనికి పాక్‌వాక్ అని పేరు పెట్టారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం దీనిని ప్రారంభించారు.
Pakistan Vaccine: కరోనావైరస్ కోసం దేశీయ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. దీనికి పాక్‌వాక్ అని పేరు పెట్టారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం దీనిని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య సలహాదారు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ఈ టీకా గురించి సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకూ పాకిస్తాన్ చైనా, రష్యాల నుంచి టీకాలు సేకరిస్తోంది. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్ తయారు చేసినట్టుగా చెబుతున్న పాక్‌వాక్ టీకా సమర్థత గురించి సుల్తాన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మేము మా వ్యాక్సిన్ సిద్ధం చేసాము. మరి కొద్ది రోజుల్లో భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తామంటూ ఆయన వివరించారు.
వాక్సిన్ విడుదల సందర్భంగా మీడియాతో డాక్టర్ ఫైసల్ మాట్లాడుతూ ”మన దేశానికి మన స్వంత వ్యాక్సిన్ తయారుచేయడం అవసరం. ఇప్పుడు అది సిద్ధంగా ఉంది కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభిస్తాము. ఈ టీకా తయారీలో మా బృందం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేను చెప్పడం లేదు. ఈ సమయంలో, చైనా మా స్నేహితుడిగా మాతో గట్టిగా నిలబడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి వచ్చిన బృందం కూడా గొప్ప పని చేసింది.” అని చెప్పారు. అంతేకాదు.. వ్యాక్సిన్ తయారు చేయడం అంత తేలిక కాదన్నారు. ముడి పదార్ధాల నుంచి టీకా చేయడం అతి పెద్ద సవాలుగా అభివర్ణించారు. అన్ని ఇబ్బందులు ఉన్నా తమ బృందం టీకా తయారు చేయడంలో విజయవంతం అయిందంటూ ప్రశంసలు కురిపించారు. ఈరోజు గర్వించదగ్గ రోజని చెప్పిన సుల్తాన్ ఇది దేశానికి చాలా ముఖ్యమైన రోజుగా వర్ణించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ చీఫ్ అసద్ ఉమర్ మాట్లాడుతూ ఈ వేవ్ లో కరోనా సోకిన వారు ముందు వేవ్ లో కరోనా సోకిన వారికంటే ఎక్కువ బాధ పడ్డారని చెప్పారు. ఆక్సిజన్ అందక 60 శాతం మంది కోవిడ్ బాధితులు మరణించారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాకిస్తాన్‌లోని చైనా రాయబారి నాంగ్ రోంగ్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ- ఈ టీకా ఉత్పత్తి పాకిస్తాన్‌తో మన స్నేహం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. చైనా వ్యాక్సిన్ బహుమతిని అంగీకరించిన మొదటి దేశం పాకిస్తాన్. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన పనులు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి మరియు దీనికి సినోవాక్ చైనా మద్దతు ఇచ్చింది.