Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Tension: ఉక్రెయిన్ సరిహద్దులో రష్యన్ సైన్యం.. రంగంలోకి నాటో దళాలు!

పొరుగునే వున్న ఉక్రెయిన్ సరిహద్దులోకి రష్యా భారీ ఎత్తున సాయుధ బలగాలను తరలించడం ఇపుడు యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది. సోవియట్ యూనియన్ విడిపోయి..

Russia-Ukraine Tension: ఉక్రెయిన్ సరిహద్దులో రష్యన్ సైన్యం.. రంగంలోకి నాటో దళాలు!
Ukrainee
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 18, 2021 | 3:48 PM

Russia-Ukraine Tension NATO troops also reaching: పొరుగునే వున్న ఉక్రెయిన్ సరిహద్దులోకి రష్యా భారీ ఎత్తున సాయుధ బలగాలను తరలించడం ఇపుడు యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది. సోవియట్ యూనియన్ విడిపోయి.. ఉక్రెయిన్ దేశం స్వయంసత్తాక దేశంగా ఆవిర్భవించినప్పట్నించి ఆదేశంతో రష్యా తరచూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే వుంది. తాజాగా ఉక్రెయిన్ సరిహద్దులోకి రష్యా లక్ష మంది సైనికులను పంపి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్ సైనికులను హతమారుస్తూనే వుంది. రష్యా చర్యలను యూరోపియన్ దేశాలే కాకుండా పలు ఇతర దేశాలు తప్పు పట్టినా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఫలితం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతూనే వుంది. దాంతో ఉక్రెయిన్‌కు సంఘీభావంగా నాటో దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. నల్ల సముద్రానికి వార్ షిప్పులను తరలిస్తున్నాయి.

రష్యా చర్యలను పలు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. బ్రిటన్ అయితే ఏకంగా నాటో దళాలను ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్లాక్ సీ (నల్ల సముద్రం)కి నాటో దళాలకు చెందిన వార్ షిప్స్‌ను డిప్లాయ్ చేస్తోంది. మే రెండో వారం కల్లా బ్రిటిష్ వార్‌షిప్స్ నల్ల సముద్రానికి చేరుకుంటాయని సన్‌డే టైమ్స్ పత్రిక పేర్కొంది. బ్రిటిష్ నావికాదళ అధికారులు వార్‌షిప్స్ తరలింపులో బిజీగా వున్నారని వివరించిందా పత్రిక. ఉక్రెయిన్ దేశానికి సంఘీభావం తెలిపేందుకే తాము వార్ షిప్స్ తరలిస్తున్నామని బ్రిటిషన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ క్యారియర్ నౌక ద్వారా 45 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైళ్ళను తరలిస్తున్నారు. వాటితో పాటు ఆర్ఎఎఫ్-35బీ జెట్లను, మెర్లిన్ సబ్ మెరీన్ హంటింగ్ హెలికాప్టర్లను కూడా నల్ల సముద్రానికి తరలిస్తున్నారు. వీటి తరలింపు కోసం హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ యుద్ధ నౌకను బ్రిటన్ వినియోగిస్తోంది.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యాను అనుకూల వాదులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో వారిని నియంత్రించేందుకు ఉక్రెయిన్ తమ సైన్యాన్ని రంగంలోకి దింపింది. దాంతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఇవి కాస్తా ఉక్రెయిన్-రష్యా సరిహద్దు దాకా విస్తరించాయి. దాంతో తమ మద్దతు దారుల రక్షణకు రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బోర్డర్‌లోకి తరలించింది. దాంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పలు మార్లు సూచించినా ఫలితం లేకపోయింది. రష్యా ఇంకా అదనపు దళాలను ఉక్రెయిన్ సరిహద్దులోకి తరలిస్తూనే వుంది. దాంతో నాటో కూటమి దళాలకు సారథ్యం వహిస్తున్న బ్రిటన్ తమ దళాలకు చెందిన యుద్ధ నౌకలను ఉక్రెయిన్‌కు సంఘీభావంగా తరలించాలని నిర్ణయించింది. అయితే ఈ తరలింపును బ్రిటన్ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అదే సమయంలో సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని బ్రిటన్ ప్రభుత్వం రష్యా అధ్యక్షున్ని కోరుతూనే వుందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు యుకేతోపాటు అంతర్జాతీయ సమాజం సిద్దంగా వుందని అన్నారాయన.

ALSO READ: కర్నాటక ముఖ్యమంత్రిని కల్వనున్న కేసీఆర్.. రాజోలిబండ సమస్యపై సీఎం ఫోకస్