Ukraine crisis: రష్యాకు వార్నింగ్.. ఉక్రెయిన్ పక్క దేశం పోలెండ్‌లో అడుగుపెట్టనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగించడం ఇది 26వ రోజు.

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగించడం ఇది 26వ రోజు. ఉక్రెయిన్ చేజిక్కడం లేదన్న అక్కసుతో రష్యా హైపర్ సోనిక్స్‌నూ రంగంలోకి దింపింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ లో భారీ క్షిపణి దాడికి పాల్పడింది రష్యా. ఉక్రెయిన్ రాజధానిని ఎలాగైనా ఆక్రమించుకోవాలని..అస్త్ర శస్త్రాలనూ ప్రయోగిస్తోంది రష్యా. రాజధాని సహా పలు కీలక నగరాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. దీని ఎఫెక్ట్‌తో బంకర్లలో ఉన్న జనం కూడా గజగజలాడుతున్నారు. తాజాగా రెట్రోవిల్లోని ఓ షాపింగ్ సెంటర్‌పై క్షిపణితో దాడి చేయడంతో..ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రష్యన్ సైన్యానికి ధీటుగా ఉక్రెయిన్ బలగాలూ జవాబిస్తున్నాయి. ఇటు మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైన్యం చేసిన ప్రతిదాడిలో రష్యాకు చెందిన నేవీ ఆఫీసర్ ఆండ్రీపాలియ్ మరణించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలెండ్‌లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌కు ఆనుకొని ఉన్న పోలెండ్‌కు ఈ నెల 25న బైడెన్ వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో బైడెన్ పోలెండ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రధాన అజెండానే పోలాండ్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటనసాగనుంది. పోలెండ్ రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడి ఆండ్రిజెజ్ దుడాతో ప్రత్యేకంగా బైడెన్ సమావేశంకానున్నారు. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవలసిన చర్చలపై బైడెన్ చర్చించనున్నారు. గత నెల రోజులుగా సాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు, పుతిన్ సేనను ఎదుర్కొనేందుకు జెలెన్‌స్కీ బలగాల పోరాటాన్ని పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. పోలెండ్ పర్యటనకు ముందు బెల్జియం పర్యటనకు బైడెన్ వెళ్తారు. బ్రస్సెల్స్ లో ఈయూ, నాటో సమ్మిట్‌లో పాల్గొంటారు. అయితే ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించే యోచన లేదని శ్వేతసౌధం వర్గాలు మీడియాకు స్పష్టంచేశాయి.
ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోలాండ్‌లో పర్యటించారు. ఆ దేశాధ్యుడు దుడాతో సమావేశమై ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఈ సందర్భంగా కమలా హారిస్, దుడా తీవ్రంగా ఖండించారు. మరీ ముఖ్యంగా అమాయక పౌరులపై రష్యా దాడులు జరపడం దారుణమంటూ ఆక్షేపించారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అగ్రరాజ్యాధినేత బైడెన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని ఇది వరకే బైడెన్ సూచించారు.
Also Read..
Summer Tips: సమ్మర్‌లో స్కిన్ ట్యానింగ్‌కు గురవుతోందా? అయితే ఈ నేచురల్ ఫేస్ ఫ్యాక్‌లు మీకోసమే..
Sound Pollution: నగరంపై ఉరుముతున్న శబ్ద మేఘాలు.. సౌండ్ పొల్యూషన్ తో ఉక్కరిబిక్కిరి
