Russia Ukraine Crisis: పుతిన్ యుద్దోన్మాదం.. ఉక్రెయిన్‌పై దాడుల గురించి రష్యన్ల మనోగతం ఏంటో ఓ సర్వేలో వెల్లడి
Russia Ukraine war poll: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం..
Russia Ukraine war poll: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. అయితే.. రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడం సబబేనా..? కాదా..? అనే విషయంపై లవెడా (Levada Center) సెంటర్ నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. యుద్ధం ప్రారంభమైన అనంతరం రష్యాలో లెవాడా సెంటర్ మార్చి 24 – 30 మధ్య ఈ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో 51% మంది రష్యన్లు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం గురించి గర్వపడుతున్నారని తేలింది. అయితే మరో 14% మంది ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పట్ల ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా రష్యాలోని 50 ప్రాంతాలలో నిర్వహించిన పోల్‌లో కనీసం 65% మంది రష్యన్లు ఉక్రెయిన్‌పై యుద్ధానికి తమ ఆమోదాన్ని వ్యక్తం చేశారు. ఈ పోల్‌లో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,632 మంది వ్యక్తులు పాల్గొన్నారని లెవాడా సంస్థ పేర్కొంది. అయితే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం గురించి కేవలం 5% మంది మాత్రమే అసహనం వ్యక్తంచేశారని తెలిపింది.
సగటున 8% మంది మంది ఈ యుద్ధంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. 12% మంది దీనిపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ పోల్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు దేశంలో బలమైన మద్దతు ఉందని అర్ధమవుతుందని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై 6% మంది ఏం చేయలేమంటూ స్తబ్దుగా సమాధానమిచ్చారంటూ సంస్థ తెలిపింది.
40వ రోజుకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 40వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రష్యా దాడుల్ని ఉక్రెయిన్ ధీటుగా తిప్పికొడుతోంది. ఉక్రేనియన్ దళాలు దేశ రాజధాని కైవ్‌కు ఉత్తరాన ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముందుకు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా ధ్వంసమైన భవనాలు, మృతదేహాలు కనిపిస్తున్నట్లు మీడియా వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం రాత్రి మాట్లాడారు. రష్యన్ దళాలు పౌరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని సృష్టిస్తోందంటూ విరుచుకుపడ్డారు.
Also Read: