RUSSIA PLAN B: పుతిన్‌కు ఓటమి భారమా ? పరువు నిలుపుకునే వ్యూహమా? అమల్లోకి రష్యా ప్లాన్ బీ.. మరి జెలెన్‌స్కీ మాటేంటి?
రష్యా దూకుడు తగ్గించి... ఓ రకంగా ప్లాన్ బీ ద్వారా పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోందా ? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. ఆ దేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చని కలలు గన్న...
RUSSIA PLAN B INTO IMPLEMENTATION PUTIN’S DEFEAT FACE SAVING EFFORT: రష్యా వెనక్కి తగ్గుతోందా ? రష్యా ఓటమి పాలైనట్లు భావించాలా ? రష్యా దూకుడు తగ్గించి… ఓ రకంగా ప్లాన్ బీ ద్వారా పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోందా ? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్(Ukraine)పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. ఆ దేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చని కలలు గన్న రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్(Vladimir Putin) ఇపుడు పరువు దక్కించుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా ఎలా జరిగింది? ప్రపంచంలో మేటి సైనిక సంపత్తిని కలిగి వున్న రష్యా.. తమ సైన్యంలో పదోవంతు కూడా లేని ఉక్రెయిన్‌ని ఎందుకు ఓడించలేకపోయింది? ఉక్రెయిన్ రాజధాని కీవ్(Kyiv)ను అత్యంత సులువుగా స్వాధీనం చేసుకుని, తద్వారా ఉక్రెయిన్‌లో తమ చెప్పు చేతల్లో వుండే నేతను గద్దెనెక్కించి.. ఉక్రెయిన్‌ను గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న పుతిన్.. ఎందుకు తన లక్ష్యాన్ని 44 రోజుల యుద్దంలో సాధించ లేకపోయింది? యాక్షన్ ప్లాన్ పక్కాగా లేకపోవడం వల్లనే పుతిన్ తన లక్ష్యానికి దూరంగా వుండిపోయారు. ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికా(America) సహా నాటో(NATO) దేశాలు వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌కు అండగా నిల్వడం వల్లనే రష్యా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
నిజానికి పుతిన్ ప్లాన్ ఏ కి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్ దేశాన్ని గుప్పిట్లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేశాడు. అందుకు తగినట్లుగానే సైన్యాన్ని పంపాడు. వారికి కావాల్సిన ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. అయితే.. ఉక్రెయిన్ ప్రతిఘటన ఈ స్థాయిలో వుంటుందని ఊహించలేకపోయాడు పుతిన్. సుశిక్షితులు, దేశం పట్ల అంకితభావం కలిగిన ఉక్రెయిన్ సైనికులు తమకున్న పరిమిత స్థాయి ఆయుధాలతోనే రష్యన్ ట్యాంకర్లను, హెలికాప్టర్లను, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను ఛేదించారు. వాటిని కూల్చేశారు. రష్యన్లు తమ టార్గెట్ చేరుకోలేకుండా దూరం చేశారు. అయితే.. ఇక్కడ నాటో దేశాల పాత్రను ప్రధానంగా చర్చించుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఉక్రెయిన్ యుద్దంలో డైరెక్టుగా రంగంలోకి దిగలేదు. అలా దిగితే అది అణు యుద్దం వైపు, మూడో ప్రపంచ యుద్దం వైపు దారి తీస్తుందని వాటికి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఉక్రెయిన్‌కు తమ సైనికులను పంపలేదు. కానీ ఆయుధాలను పంపాయి. ముఖ్యంగా జావెలిన్, స్టింగర్ లాంటి ట్యాంకర్ ఛేదక మిస్సైల్స్‌ని అమెరికా ఉక్రెయిన్‌కు తరలించింది. అమెరికా వద్ద మొత్తం పది వేల జావెలిన్ మిస్సైల్స్ వుంటే అందులోంచి ఆరు వేల మిస్సైల్స్‌ని ఉక్రెయిన్‌కు పంపించింది. అందివచ్చిన అవకాశాన్ని ఉక్రెయిన్ సైనికులు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్‌తో రష్యన్ సైన్యం పని పట్టారు. రష్యన్ ట్యాంకర్లను మరీ ముఖ్యంగా కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు 65 కిలో మీటర్ల మేర తరలి వచ్చిన రష్యన్ ట్యాంకర్ల కాన్వాయ్‌ని తుత్తునియలు చేశారు. హెలికాప్టర్లను, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను పెద్ద ఎత్తున కూల్చేశారు.
నిజానికి పుతిన్ ప్లాన్ దారుణంగా విఫలమైందనే చెప్పాలి. ఈజీగా ఉక్రెయిన్‌ని ఓడిస్తామని అనుకున్న పుతిన్ ఒక్కసారి గత అనుభవాలను గుర్తు చేసుకుని వుండాల్సింది. 1905లో రష్యా, జపాన్ మధ్య యుద్దం జరిగింది. అప్పట్లో జపాన్ రష్యా ముందు చాలా చిన్న దేశం. కానీ జపాన్ సైనికుల పోరాట పటిమ ముందు రష్యా నిలువలేకపోయింది. ఆనాటి యుద్దంలో రష్యా ఓటమి పాలైంది. అదే విధంగా అమెరికా, వియత్నాం యుద్దం అనుభవాన్ని రష్యా విస్మరించింది. అఫ్గాన్‌పై రష్యా పదేళ్ళపాటు యుద్దం చేసినా గెలవలేకపోయింది. 1979లో చైనాను వియత్నాం ఎదిరించి నిలిచిన సన్నివేశాన్ని గుర్తు చేసుకోవాల్సింది. అంతకు ముందు రెండో ప్రపంచ యుద్ద కాలంలో అంటే 1945లో నియంత హిట్లర్‌ను రష్యా ఎలా నిలువరించిందో ఙ్ఞాపకం చేసుకోవాల్సింది. మరీ గతానికి వెళితే అంటే 1812లో నెపోలియన్ ఓటమిని చదవాల్సింది. ఈ అనుభవాలను పుతిన్ ఓసారి స్ఫురణలోకి తెచ్చుకుని వుంటే ఉక్రెయిన్ ఆక్రమణకు రంగంలోకి దిగేవాడే కాదేమో లేకపోతే.. కనీసం పక్కా ప్లాన్ అయినా రచించుకునేవాడేమోనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ మరో విషయం ప్రధానంగా చెప్పుకోవాలి. రష్యాకు ఇపుడు తమ మిత్రడెవరో.. తమతో టైమ్ పాస్ చేసే మిత్రులెవరో తెలిసి వచ్చిందని భావించాలి. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ పర్వం మొదలు కాకముందు.. రష్యాతో చైనా, తద్వారా పాకిస్తాన్ సన్నిహితంగా మెదిలాయి. అందుకే యుద్దం మొదలైన కొన్ని రోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో సందర్శించారు. ఇది రష్యా పట్ల మిత్రుత్వాన్ని ప్రదర్శిచడానికి ఏ మేరకు ఉపయోగపడిందో కానీ.. అమెరికా ఆగ్రహానికి మాత్రం గురయ్యాడు ఇమ్రాన్. తద్వారా తన పదవిని కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమైంది. అటు చైనాకు రష్యా సన్నిహిత దేశాల జాబితా నుంచి వైదొలగినట్లయింది. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ప్లాన్ ఏ విజయవంతమైతే.. చైనా వెంటనే తన ప్లాన్‌ను అమలు పరిచేది. తైవాన్ దురాక్రమణకు రంగంలోకి దిగేది. ఇపుడు ఉక్రెయిన్ ప్రతిఘటన చైనాను సైతం తైవాన్ విషయంలో వెనుకంజ వేసేలా చేసింది. రష్యాకు అనుకూలంగా రంగంలోకి దిగేందుకు చైనా వెనుకంజ వేసింది. నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభానికి కేవలం 15 రోజుల ముందే రష్యా, చైనాల మధ్య పరిమితులు లేని వ్యూహాత్మక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆ మేరకు చైనా రష్యాకు అవసరమైన సమయంలో ఆయుధాలు, ఆహారం, యుద్దరంగంలో అవసరమయ్యే వైద్యవసతులను సమకూర్చాల్సి వుంది. కానీ అమెరికా హెచ్చరికల ప్రభావంతో డ్రాగన్ కంట్రీ సరైన సమయంలో వ్యూహాన్ని మార్చుకుంది. రష్యాకు మొండిచేయి చూపించింది.
ఇదిలా వుంటే.. రష్యా దురాక్రమణను నేరుగా సమర్థించకుండానే భారత్.. ఆదేశానికి సన్నిహిత దేశంగా మరోసారి నిరూపించుకుంది. నిజానికి రష్యా, భారత్ చిరకాల మిత్రులే. భవిష్యత్తులోను రష్యాతో సన్నిహిత సంబంధాలను మెయింటేన్ చేయాల్సిన అవసరం మనకుంది. 1971 ఇండో పాక్ యుద్దసమయంలో రష్యా భారత్‌కు అండగా నిల్వడం వల్లనే మన దేశ విజయం సులభసాధ్యమైందన్న సంగతి విస్మరించలేం. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉక్రెయిన్ పట్ల పూర్తి సానుభూతి ప్రదర్శిస్తూనే రష్యా చర్యను వ్యతిరేకించలేదు. శాంతి ద్వారా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పుతిన్‌కు మోదీ కాస్త గట్టిగానే చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 22 వేల 500 మంది భారతీయులను సురక్షితంగా మనదేశానికి తరలించే విషయంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతోను, ఇటు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌తోను టెలిఫోనిక్ సంభాషణలను జరుపుతూ కీలక సమయంలో కాల్పుల విరమణ పాటించేలా చేస్తూ.. ఉక్రెయిన్ పొరుగున వున్న పోలండ్, హంగరీ, స్లోవేకియా, రొమానియా దేశాలతో సంప్రదింపులు జరిపి.. మన ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ అక్కడి ఎయిర్ పోర్టుల్లో ల్యాండయ్యేలా.. భారతీయులకు ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఎమర్జెన్సీ ఇమ్మిగ్రేషన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఏకంగా నాలుగు దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపించారు. ఉక్రెయిన్ బోర్డర్ దాటిన ప్రతీ ఒక్క ఇండియన్‌ని ప్రత్యేక వసతుల ద్వారా న్యూఢిల్లీకి తరలించారు. ఇందుకు భారత ప్రభుత్వం చూపిన చొరవ, తీసుకున్న చర్యలు ప్రపంచ దేశాల అభినందనలు పొందాయి.
భారత్ ఆయుధాల దిగుమతుల్లో రష్యాదే ఎక్కువ భాగస్వామ్యం. మన దేశ ఆయుధాల దిగుమతుల్లో 65 శాతం రష్యావే. సైనిక శిక్షణలోను రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. జలాంతర్గాముల నిర్మాణంలోను రష్యా మనతో కలిసి పని చేస్తోంది. పలు మార్లు ఇరు దేశాలు సంయుక్త మిలిటరీ విన్యాసాలను నిర్వహించాయి. మిలిటరీ టెక్నాలజీలోను రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం రష్యాకు కూడా వుంది. అందుకే ఓవైపు యుద్దం కొనసాగుతుండగానే రష్యా విదేశాంగ శాఖా మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. ముందుగా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌తో సమాలోచనలు జరిపారు. మర్నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోను ఆయన భేటీ అయ్యారు. ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరికి లావ్రోవ్ కృతఙ్ఞతలు తెలిపారు. 35 శాతం సబ్సిడీతో ముడిచమురు ఎగుమతి ఆఫర్ ఇచ్చారు. ముడి చమురే కాదు ఏది అడిగినా సరఫరా చేసేందుకు తాము రెడీ అంటూ బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చారు.
ఉక్రెయిన్, రష్యా విషయంలో మన దేశం వైఖరి ఎలా వున్నా.. ఇపుడు రష్యా ఓటమి దిశగాను, వెనక్కి తగ్గే దిశలోను పయనిస్తుందనే చెప్పాలి. మొన్నటి వరకు కీవ్ నగరాన్ని గుప్పిట్లోకి తీసుకుందామని విఫలయత్నం చేసిన రష్యన్ సైనికులు ఇపుడు వెనుకంజ వేశారు. కీవ్ నగరాన్ని వీడి.. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఈ చర్యలను గమనిస్తున్న అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు.. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాన్నితమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా సైనిక చర్యను రష్యా విరమిస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్ ఏరియాలోని డాన్ బాస్ ప్రాంతాన్ని రష్యా ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా క్రిమియా నుంచి ఈశాన్య ఉక్రెయిన్ వరకు రష్యా పరిధిలోకి తీసుకునేందుకు ఇపుడు రష్యా ప్రయత్నిస్తోందంటున్నారు. మేరియుపోల్‌లో విధ్వంసం సృష్టించడం, అక్కడి ప్రజలను రహస్యంగా తరలించడం వెనుక ఈ వ్యూహమే వుందని తెలుస్తోంది. రష్యా తాజా వ్యూహం ప్రకారం తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యన్ దళాలు కొనసాగుతాయి. క్రిమియా తరహా ఒప్పందాన్ని ఉక్రెయిన్‌తో చేసుకుంటుంది. అయితే.. 44 రోజుల యుద్దం తర్వాత క్రిమియా తరహా ఒప్పందానికి ఉక్రెయిన్ ఏ మేరకు సిద్దమవుతుందన్నది ప్రశ్నార్థకమే. అటు అమెరికా, యూరప్ దేశాలు ఈ ఒప్పందంపై ఎలా స్పందిస్తాయో తెలియదు. రష్యా ప్లాన్ బీ మేరకు తూర్పు ఉక్రెయిన్‌పై ఒప్పందం కుదిరితే రష్యా గౌరవప్రదంగా ఈ యుద్దానికి ముగింపునిచ్చినట్లుగా భావించాలి. ఒప్పందం కుదరకపోతే.. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా విఫలయత్నం చేసిందని భవిష్యత్ తరాలు తమ హిస్టరీ పుస్తకాల్లో చదువుకోవాల్సిందే.