RISHI SUNAK: బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి.. 2022 చివరి నాటికి అద్భుతం జరగడం ఖాయమేనా..?

ఒక్కోసారి అనూహ్య పరిణామాలు జరుగుతూ వుంటాయి. ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి. భారత దేశానికి వాణిజ్యం పేరిట వచ్చి.. ఇక్కడి వారికి నాగరికత, వాణిజ్యం..

RISHI SUNAK: బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతి వ్యక్తి.. 2022 చివరి నాటికి అద్భుతం జరగడం ఖాయమేనా..?
Rishi Sunak To Be Next Britain Pm

RISHI SUNAK TO BECOME BRITAIN PRIME MINISTER: ఒక్కోసారి అనూహ్య పరిణామాలు జరుగుతూ వుంటాయి. ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి. భారత దేశానికి వాణిజ్యం పేరిట వచ్చి.. ఇక్కడి వారికి నాగరికత, వాణిజ్యం నేర్పుతామంటూ రెండు వందల సంవత్సరాలు దుష్పరిపాలన చేసిన బ్రిటిషర్లను ఓ భారతీయ సంతతి వ్యక్తి పరిపాలించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ మీడియాతోపాటు మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు నిజమైతే.. త్వరలోనే బ్రిటన్ పరిపాలనా భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ దేశ మీడియా ఇప్పుడు ఇదే అంశాన్ని కోడై కూస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌కు పదవీ గండం పొంచి వుందని, ఆయన వైదొలిగితే ఆపదవికి భారతీయ సంతతి వ్యక్తే అర్హుడని బ్రిటన్ మీడియా విశ్లేషిస్తోంది. ఈ విషయంలో ఏకంగా ఆన్‌లైన్‌లో బెట్టింగులు కూడా జోరందుకోవడం విశేషం.

యాభై ఏడేళ్ళ బోరిస్‌ జాన్సన్‌‌పై ఈ మధ్యకాలంలో పలురకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర క్రితం దేశాన్ని కోవిడ్‌ కుదిపేస్తున్న సమయంలో బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌన్‌ స్ట్రీట్‌లో తన సహచరులతో కలిసి నిర్వహించిన లిక్కర్ పార్టీ జాన్సన్ పదవికి గండాన్ని తెచ్చి పెట్టింది. అప్పటికే కరోనా కట్టడి నిమిత్తం దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో జాన్సన్‌ లిక్కర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఇప్పుడు బ్రిటన్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీయేగాక.. సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. చివరకు ఆయన జనవరి 13న బ్రిటన్ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో అపాలజీ అడుక్కోవాల్సి వచ్చింది. క్షమాపణలు చెప్పినప్పటికీ జాన్సన్ పదవి నుంచి వైదొలగాలన్ని డిమాండ్ చాలా బలంగా వినిపిస్తోంది.

ఒక వేళ జాన్సన్ పదవి నుంచి దిగిపోతే పరిస్థితి ఏంటి? ఈ విషయంలో పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ మీడియాతోపాటు.. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ తమ విశ్లేషణలను ప్రచురిస్తున్నాయి..ప్రసారం చేస్తున్నాయి. మరి జాన్సన్ వారసుడు ఎవరనే విషయంలో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. రిషిప్రస్తుతం బ్రిటన్‌ ఫైనాన్స్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తూ.. ఆయన ఇటీవల పార్లమెంటులో సమర్పించిన బడ్జెట్ అందరి ప్రశంసలను అందుకుంది. అయితే.. బోరిస్‌ జాన్సన్ క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషి సునక్ అక్కడ లేకపోవడంపై ఆ దేశంలోని ప్రధాన పత్రికలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రధానిపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఆయన సభకు రాలేదని విశ్లేషించాయి. అయితే అది నిజం కాదని రిషి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూపై జరిగిన కీలక సమావేశంలో పాల్గొనాల్సి రావడం వల్లనే జాన్సన్ అపాలజీ అడుగుతున్న సమయంలో సభలో లేనని ఆయన చెప్పుకున్నారు.

అయితే.. ప్రధాని క్షమాపణలు చెప్పడాన్ని సమర్థిస్తూనే.. ఈ వ్యవహారంపై కొనసాగుతున్న విచారణ ముగిసే వరకు ఓపికతో ఉండాలని, సంయమనం పాటించాలంటూ బోరిస్‌ చేసిన విజ్ఞప్తికి తాను మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని కూడా అక్కడి పత్రికలు, మీడియా హౌస్‌లు భిన్నంగా విశ్లేషించాయి. బోరిస్‌కు మద్దతుగా నిలవడంతో రిషి స్పందన చాలా పేలవంగా ఉందని పేర్కొన్నాయి. బోరిస్‌ సహా అధికార వర్గాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వస్తున్న వార్తలపై సూగ్రే అనే సీనియర్ సివిల్‌ సర్వెంట్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఊహాగానాలపై బెట్‌ఫెయిర్‌ అనే ఆన్‌లైన్‌ సంస్థ బెట్టింగ్‌ నిర్వహిస్తుంటుంది. బోరిస్‌ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునక్‌కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు బెట్‌ఫెయిర్‌ ప్రతినిధి శామ్‌ రాస్‌బాటమ్‌ వేల్స్‌ఆన్‌లైన్‌ అనే మీడియా హౌజ్‌కు తెలిపారు. తర్వాతి స్థానంలో విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్‌, క్యాబినెట్‌ మంత్రి మైకేల్‌ గోవ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాంగశాఖ మాజీ సెక్రటరీ జెరెమీ హంట్‌, భారత సంతతికి చెందిన హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌, హెల్త్‌ సెక్రటరీ సజిద్‌ జావిద్‌, క్యాబినెట్‌ మంత్రి ఒలివర్‌ డోడెన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

బెట్‌ఫెయిర్‌.. ఎక్స్ఛేంజీ సర్వీసులను కూడా అందిస్తుంటుంది. ఇందులో గ్యాంబ్లర్లు బెట్టింగ్‌ కోసం సొంతంగా మార్కెట్‌ను ఏర్పాటు చేసుకునే ఛాన్స్ వుంది. బోరిస్‌ జాన్సన్‌పై నిర్వహిస్తున్న బెట్టింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్.. ఈ సంవత్సరం చివరకు బోరిస్‌ తన పదవిని కోల్పోనున్నట్లు ఇండికేషన్ ఇస్తోంది. ఇక వివిధ బెట్టింగ్‌లను పోల్చి చూసే ఆడ్స్‌చెకర్‌ సైతం బోరిస్ జాన్సన్ వారసుల రేసులో రిషి సునక్‌ అందరికంటే ముందంజలో ఉన్నట్లు తెలిపింది. బోరిస్‌ క్షమాపణలు చెప్పడానికి ముందు యూగవ్‌ పేరిట ది టైమ్స్ ఓ సర్వే కండక్ట్ చేసింది. ప్రతి పది మందిలో ఆరుగురు బోరిస్‌ జాన్సన్ తప్పుకోవాల్సిందేనని వాదిస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. చివరి ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటేసిన వారిలోనూ 38 శాతం మంది బోరిస్ జాన్సన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు బోరిస్‌ నిజాయతీగా సమాధానాలు ఇవ్వడం లేదని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 63 శాతం మంది కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన వారు ఉండడం గమనార్హం.

సో.. అన్నీ అనుకున్నట్లు కొనసాగితే.. 2022 చివరి నాటికి బ్రిటన్ పరిపాలనా పగ్గాలు భారతీయ సంతితికి చెందిన రిషి సునక్‌ చేతికి అందే అవకాశాలున్నాయి. రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్లు ఇండియాను పరిపాలించారు. మన దేశంలోని సంపదను దోచుకుపోయారు. బ్రిటిషర్లు మనదేశం నుంచి తరలించిన సంపద విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం లెక్కిస్తే ఏకంగా 48 లక్షల కోట్ల రూపాయలుగా వుంటుందని ఇటీవల గ్రావిటాస్ అనే మీడియా హౌజ్ తమ కథనంలో పేర్కొంది. అలాంటి దేశానికి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అధినేత కాబోతుండడం ప్రతీ భారతీయుడు గర్వంగా ఫీలయ్యే అంశంగా మారే పరిస్థితి నెలకొంది.

Published On - 7:47 pm, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu